లేచిపోతే ఎంత బాగుంటుంది! ముహూర్తం ఫిక్స్..
posted on Mar 16, 2021 @ 3:20PM
మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అమరావతి అసైన్డ్ భూముల కేసులో సీఐడీ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. దళితులను మోసం చేసిన చంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలని కొందరు వైసీపీ నేతలు కోరుతున్నారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. చంద్రబాబుకు నోటీసులు, జగన్ సర్కార్ తీరుపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను సాకుగా చూపి రాత్రిరాత్రే దుకాణం సర్దేయడానికి సీఎం సిద్ధమవుతున్నారని రఘురామ చెప్పారు. ప్రజలు తీర్పు ఇచ్చారని... ఇక్కడ రాజధాని వద్దంటున్నారని కోర్టుకు వైసీపీ ప్రభుత్వం చెప్పనుందని అన్నారు. ఓ మహానుభావుడు ముహూర్తం పెట్టారట... మూటాముళ్లే సర్దుకుని ఆయన వెళ్లిపోతారట అని తెలిపారు. అధికారుల పిల్లలకు స్కూళ్లు, కాలేజీలు, ఇళ్లపై పలు సూచనలు చేశారని తెలుస్తుందన్నారు రఘురామ రాజు. ఈ అప్రతిహత విజయాన్నిసాకుగా చూపి... ఇక్కడి నుంచి రాత్రికి రాత్రి దుకాణం కట్టేసి లేచిపోదామని అనుకుంటున్నారని వెల్లడించారు. రాత్రికి రాత్రే లేచిపోవడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారని రఘురామ రాజు చెప్పారు. అయితే లీగల్‌గా ఇది చెల్లదన్నారు. వందలాది సలహాదారులు మీకు సలహా ఇవ్వడం లేదా? 20 సార్లు ముహూర్తం పెట్టారు. మధ్యలోనే ఆగిపోయారు అని జగన్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు రఘురామ రాజు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్రటేరియట్ అమరావతిలోనే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.