అమ్మకు మించి దైవమున్నదా?
posted on Jan 11, 2023 8:48AM
ముందు అమ్మ.. ఆ తరువాతే ఏదైనా.. ఇదీ అమ్మ గొప్పతనం. ఎంత ఎదిగినా బిడ్డ ఆలనా పాలనా స్వయంగా చూసుకుంటేనే ఆమెకు తృప్తి ఆనందం. అత్యున్నత స్థానంలో ఉండి కూడా బిడ్డ ఆలనా పాలనా చూసేందుకు వాటిని తృణ ప్రాయంగా త్యజించిన వాళ్లను చూశాం.
నెలల పిల్లను చంకనేసుకుని విధి నిర్వహణ చేసిన వారినీ చూశాం. కరోనా సమయంలో బిడ్డను వీడి ఆసుపత్రుల్లో ఉద్యోగం చేస్తూ కన్నీటి పర్యంతమైన తల్లుల గాధలూ విన్నాం. ఇప్పుడు తాజాగా ఓ కంపెనీ సీఈవో.. తన విధులు నిర్వహిస్తూనే బిడ్డ ఆలనా పాలనా కూడా చూసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. చంటి బిడ్డతో ఆఫీసుకు వచ్చి అటు తల్లిగా, ఇటు సీఈవోగా ఆమె ద్విపాత్రాభినయం చేస్తున్న దృశ్యాలు నెటిజన్లను కదిలించి వేస్తున్నాయి. ఆమెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నాయి.
ఎడెల్విస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో, ఎండీ రాధికా గుప్త తల్లిగా, సీఈవోగా తాను ట్రావెల్ చేస్తున్న తీరుపై ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన డెస్క్ పక్కనే ఆమె కుమారుడు బొమ్మలతో ఆడుకునే ఫోటోను ఆమె ట్వీట్ కు జత చేశారు. ఆడవారి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను రాధిక పోస్ట్ చేసిన ఒక్క పోస్ట్ తో వివరించినట్టైందని నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.