భారాస తెలుగుదేశం జోరు పెంచేస్తుందా?
posted on Jan 11, 2023 5:56AM
ఎన్నికల హడావుడి మొదలైపోయింది. దీంతో అన్ని పార్టీలూ ఓట్ల వేట ప్రారంభించాయి.. అధికార పీఠాన్ని కైవసం చేసుకొనేందుకు వ్యూహాలు.. ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అందులోభాగంగా.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. జనవరి 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. అయితే టీఆర్ఎస్ .... బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడం.. ఈ సభకు దేశంలోని బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులను సైతం ఆహ్వానించారు. వారిలో ఎవరు వస్తారు? ఎవరు రానన్నది పక్కన పెడితే.. సభ ఏర్పాట్లు మాత్రం వేగంగా జరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఇదే కావడంతో అందుకు తగినట్లుగా ఘనంగా ఈ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.
మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. ఇటీవల ఖమ్మంలో శంఖరావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సభ సక్సెస్‌తో.. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీలో లీడర్ నుంచి కేడర్ వరకు అందరిలో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపించింది. అంతే కాదు తెలుగుదేశం పార్టీ ఆంధ్రలోనే బతికి ఉంది.. తెలంగాణలో మాత్రం కనుమరుగైపోయిందంటూ వస్తున్న విమర్శలకు ఈ సభ సక్సెస్ ఫుల్‌స్టాప్ పెట్టింది. దీంతో కొత్త ఊపు ఉత్సాహంతో తెలంగాణలో తెలుగుదేశం అడుగుల వేగం పెంచింది. అయితే బారాస అధినేత కేసీఆర్.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తోందంటూ ప్రకటించారు. అలాంటి వేళ.. ఆయన దేశంలో ఎక్కడైనా ఈ సభను నిర్వహించవచ్చు. కానీ అలా కాకుండా.. తెలంగాణలోని అదీ.. ఖమ్మం వేదికగా ఈ సభను ఏర్పాటు చేయడం ఏమిటనే చర్చ అయితే పార్టీ వర్గాల్లోనే మొదలైంది.
మరోవైపు గతంలో ఖమ్మం జిల్లాలోని పలు పార్టీలకు చెందిన కీలక నేతలు.. కారు పార్టీలోకి జంప్ కొట్టి.. షికారు కొట్టారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో వారంతా వరుసగా ఒక్కొక్కరుగా కారు దిగి.. ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. ఇక అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైకిల్ పార్టీలో చేరేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలే కాదు.. కేడర్ సైతం భారీగానే ఉన్నట్లు.. ఆ క్రమంలోనే వారంతా కలసికట్టుగా చంద్రబాబు సభను.. సూపర్ డూపర్ సక్సెస్ చేశారని సమాచారం. అయితే అదే ఖమ్మంలో సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తే... చంద్రబాబు సభకు తరలి వచ్చినట్లు జనం తరలి వస్తారా? అనే ఓ సందేహం భారాస శ్రేణులను తొలిచేస్తోందని అంటున్నారు.
ఎందుకంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస పెద్దగా బలంగా లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే ఓ వేళ.. ఖమ్మంలో కేసీఆర్ సభకు జనం రాకుంటే.. బీఆర్ఎస్ పార్టీ సినిమా ఖమ్మం గల్లీలోనే ఆడలేదు.. ఇక ఢిల్లీలో ఏం ఆడుతుందనే ఓ విమర్శనాస్త్రాన్ని ప్రతిపక్ష పార్టీలకు అందించినట్లు అవుతుందని భారాసా శ్రేణులు భావిస్తున్నారని సమాచారం. దీంతో టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఇమేజ్‌ను ప్రతిపక్షాలు డ్యామేజీ చేసినా చేస్తాయని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
అయినా కేసీఆర్.. తెలంగాణలో ఇన్ని జిల్లాలు ఉండగా.. ఖమ్మంనే ఎందుకు ఎంచుకున్నారు... అక్కడే సభ ఎందుకు నిర్వహించాలని నిర్ణయించారనే అంశంపై క్లారిటీ రాకపోవడంతో.. కారు పార్టీలోని శ్రేణులంతా సందేహం తీర్చేవారి కోసం వెతుకుతున్నారు. ఏదీ ఏమైనా మళ్లీ పురిటిగడ్డపై తెలుగుదేశం పార్టీ పుంజుకొంటోంది... అలాంటి వేళ.. కారు పార్టీ తెలంగాణలో జోరు తగ్గిందని భారాస ఖమ్మం సభ తేలిస్తే.. ఇక తెలంగాణలో తెలుగుదేశంకు తిరుగుండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.