ఓటర్లకు జోరుగా టీఆర్ఎస్ ప్రలోభాలు! పోలీసులే సహకరిస్తున్నారంటున్న విపక్షాలు
posted on Nov 30, 2020 @ 9:45AM
గ్రేటర్ హైదరాబాద్ లో ప్రచార గడువు ముగిసినా.. అంతర్గతంగా కొందరు క్యాపెంయిన్ చేస్తూనే ఉన్నారు. అధికార పార్టీ నేతలు ఇలాంటి ప్రచారాలు ఎక్కువగా చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నేతలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. విపక్షాలకు చెందిన అభ్యర్థులు, నేతలపై నిఘా పెట్టిన పోలీసులు.. అధికార పార్టీ నేతలను మాత్రం వదిలేస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు.
గ్రేటర్ లో ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. డబ్బు, మద్యం పంపిణి ప్రవాహంలా జరుగుతుందని తెలుస్తోంది. అన్ని పార్టీలు డబ్బు, మందు పంపిణి చేస్తున్నా... అధికార పార్టీ నేతలు మాత్రం బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసుల సహకారంతోనే గులాబీ నేతలు నేతలు మద్యం, మనీ ఓటర్లకు పంచుతున్నారని తెలుస్తోంది. అధికారులు , పోలీసులు అధికార పార్టీకి కుమ్మక్కయ్యారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణి సందర్భంగా గ్రేటర్ లోని చాలా ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయి. తాము ఓటర్లకు డబ్బులు పంచుతూనే ప్రత్యర్థి పార్టీలు ఆ పనిచేయకుండా అభ్యర్థులు నిఘా కాస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో మనీ పంపిణి చేస్తుండగా పట్టుకోవడాలు, అడ్డుకోవడాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరుగుతున్న ఘర్షణలతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగిన ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోనూ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. సరూర్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుచరులు డబ్బులు పంచుతుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నోట్ల కట్టలను వారి నుంచి లాగేసుకున్నారు. గడ్డిఅన్నారంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనుచరులు ప్రలోభాలకు గురి చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓటర్లకు మద్యం,డబ్బులు పంచుతున్న ఎమ్మెల్యే అనుచరులను బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఎమ్మెల్యే అనుచరుల నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు . బూత్ కో ఇంచార్జ్ ద్వారా డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు ఎమ్మెల్యే అనుచరుడు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాలతో ఓటుకు నోటు ఇస్తున్నట్టు తెలిపాడు.
కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోనూ పలు ప్రాంతాలు గొడవలు జరిగాయి. జగద్గిరిగుట్టలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వారి దగ్గర నుంచి నోట్ల కట్టలు తీసుకున్నారు. మహిళా సంఘాల ద్వారా అధికార పార్టీ డబ్బులు పంపిణి చేస్తుందనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. రహమత్ నగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ పడ్డారు. అంబర్ పేట నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతి బారాదరి లో గన్ కలకలం రేపింది. టిఆర్ఎస్ కి సంబంధించిన నేతలు డబ్బుల పంపిణీ చేస్తున్నారని సమాచారంతో అక్కడికి చేరుకున్నారు బిజెపి కార్యకర్తలు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప జేశారు. యాకూబ్ రెడ్డి అనే టిఆర్ఎస్ నేత వెంట ఉన్న ఓ వ్యక్తి వద్దా రివాల్వర్ గమనించిన బీజేపీ నేతలు హడలిపోయారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారని బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.