మోడీ వర్సెస్ ఎవరు? రేసులో నలుగురు సీఎంలు
posted on Sep 17, 2022 @ 10:21AM
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముందు గుజరాత్ ముఖ్యమంత్రి, ఆతర్వాత ప్రధాన మంత్రి అయ్యారు. అలాగే, తెలంగాణ ప్రస్తుత ముఖ్యమత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు, రేపు ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. అయితే,ఆ ఇద్దరి మధ్య ఉన్న పోలిక ఇద్దరు ముఖ్యమంత్రులు కావడం ఒక్కటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా, అంటే చెప్పుకోదగ్గ సారూప్యాలు అయితే ఉన్నట్లు కనిపించడం లేదు.
ఆ ఒక్క కామన్ ఫాక్టర్ తోనే కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా? అంటే, కానూ వచ్చును కాకపోనూ వచ్చును, కొయ్య గుర్రం ఎగరా వచ్చును. కానీ, ముఖ్యమంత్రి మోడీ ప్రధాని మోడీ అయ్యారు కాబట్టి, అదే ఫార్ముల ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని అవుతారని అనుకుంటే మాత్రం అది అయ్యే పని కాదు. మోడీకి ఉన్న బలం కేవలం ముఖ్యమంత్రి పదవి కాదు. ఆయన వెనక జాతీయ వాదం పునాదుల మీద ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగిన బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలున్నాయి.
ఆ విషయం అలా ఉంటే, నిజానికి, మోడీకి ముందు గతంలోనూ మొరార్జీ దేశాయ్ మొదలు మన పీవీ వరకు ప్రధాని పీఠాన్ని అలంకరించిన ముఖ్యమంత్రులు ఉన్నారు. దేవెగౌడ, చరణ్ సింగ్ కూడా ఆ కోవలోకే వస్తారు. అయితే, అందులో ఏ ఒక్కరూ కూడా, కష్టపడి నిచ్చెన మెట్లు ఎక్కిన వారు కాదు. అనుకోకుండా, ఆశించకుండానే ప్రధానులయ్యారు. అందులో, రిటైర్మెంట్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన పీవీ మినహా మిగిలిన ఏ ఒక్కరు కూడా ఐదేళ్ళు కాదు, అందులో సగం రోజులు కూడా ప్రధాని కుర్చీలో స్థిరంగా కూర్చో లేదు. చరణ్ సింగ్ అయితే పార్లమెంట్ ముఖం అయినా చూడకుండానే ఇంటి ముఖం పట్టారు.
అయితే ప్రధాని నరేంద్ర మోడీ అలా కాదు, ప్రజామోదంతో ప్రదాని అయ్యారు.అది కూడా ఒకసారి కాదు, రెండు సార్లు ప్రధాని అయ్యారు. రెండుసార్లు కూడా సొంత (పార్టీ) బలంతోనే అధికారాన్నిఅందుకున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ/ఎన్డీఎ మోడీని ప్రధాని అభ్యర్ధిగా ముందుగానే ప్రకటించింది. మోడీ నాయకత్వంలోనే ఎన్నికల బరిలో దిగింది. ఇంచుమించుగా మూడు దశాబ్దాలకు పైగా సాగిన సంకీర్ణ శకానికి చుక్క పెట్టింది. ఎన్డీఎ కూటమిగా పోటీ చేసినా, ఒక్క బీజేపీకే 283 (మ్యాజిక్ ఫిగర్ 272) సీట్లు దక్కాయి. 2019లో బీజేపీ సొంత బలం మరింత పెరిగి 303 కి చేరింది. అవును, ఇప్పటికీ మోడీ ప్రభుత్వం సాంకేతికంగా సంకీర్ణ ప్రభుత్వమే అయినా, నిజానికి సాగుతోంది, బీజేపీ పాలనే,గిట్టని వాళ్ళు మోడీ షా పాలనా అంటారు అనుకోండి అది వేరే విషయం.
అదొకటి అలా ఉంటే, ఇప్పుడు ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు మరో ముగ్గురు ముఖ్యమంత్రులు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా ప్రధాని రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్కోర్స్, కేసీఆర్ సహా ఏ ఒక్కరూ కూడా పీఎం రేసులో ఉన్నామని ప్రకటించక పోయినా, ఎవరి ప్రయత్నాలో వారున్నారు.చివరకు ఏమి జరుగుతుంది? ఏమి జరగదు? అనేది ప్రస్తుతానికి సమాధానం చిక్కని ప్రశ్న. నిజానికి, పీఎం రేసులో ఉన్న ముఖ్యమంత్రులు నలుగురు అయినా, ప్రధాని పదవిని ఆశిస్తున్న రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఇలా మరి కొందరు మహా నాయకుల జాబితా మరొకటి ఉంది. ఈ జాబితాల్లో చివరకు మిగిలేది ఎవరో.. తెలితేనే కానీ, మోడీ వర్సెస్ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం చిక్కదు.