ప్రధాని తెలంగాణ పర్యటన.. కేసీఆర్ మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన?
posted on Nov 5, 2022 @ 10:05AM
ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మోడీ తెలంగాణ పర్యటన అనగానే అందరూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసి చూస్తున్నారు. ఇటీవలి కాలంలో మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతి సారీ ప్రొటోకాల్ ను సైతం పట్టంచుకోకుండా కేసీఆర్ ఆయనకు ముఖం చాటేశారు. ఇప్పుడు మళ్లీ మరో మారు అదే జరగనుందా అన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.
ప్రధాని నరేద్ర మోడీ ఈ నెల 12న తెలంగాణకు రానున్నారు. ఆ సందర్భంగా ఆయన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభకు కేసీఆర్ హాజరౌతారా? మోడీతో భేటీ అవుతారా మోడీని కలుస్తారా? లేక గతంలో ఎలా అయితే డుమ్మా కొడుతున్నారో అదే విధంగా ఈ సారి కూడా ముఖం చాటేస్తారా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య అగాధం పెరిగిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా కేసీఆర్ మోడీ లక్ష్యంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో కేసీఆర్ విమర్శలన్నీ మోడీ లక్ష్యంగానే సాగాయి.
ఈ వ్యవహారంలో ఆయన మీడియా మీట్ లో కూడా నేరుగా మోడీనే నిలదీశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా ప్రధాని పర్యటన పై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ సంబంధితి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.