ప్రాణ రక్షణ కోసం చిరుత పోరాటం!
posted on Nov 5, 2022 9:20AM
పిల్లైనా సరే తలుపులు మూసి కొడితే తిరగబడుతుంది. అది చిరుతపులి అయితే ఇక చెప్పేదేముంది. తలుపులు మూయక్కర్లే ఒకింత అదిలించినా, బెదిరించినా తిరగబడటం ఖాయం. అదే జరిగింది. కర్నాటకలోని మైసూరులో పొరపాటున ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చేసింది. దానిని చూసిన స్థానికులు రాళ్లు రువ్వారు.
అసలే కొత్త ప్రాంతం అప్పటికే భయంతో ఉన్న ఆ చిరుత జనం రాళ్లు రువ్వడంతో మరింత భయపడింది. తప్పించుకోవడానికి ఆ చిరుత చేసిన ప్రయత్నంలో ఇద్దరిపై దాడి చేసి గాయపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను అటవీ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో పోస్టు చేశారు. వెంటనే ఆ వీడియో వైరల్ అయ్యింది.
జనావాసంలోకి వచ్చిన చిరుతపై ఓ భవనంపై ఉన్న వ్యక్తులు రాళ్లురువ్వారు. దీంతో ఆ చిరుత తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డు పైకి పరుగుతీసింది. ఆ సమయంలో అటుగా ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిపై దాడి చేసింది. అతడు గాయపడ్డాడు.
ఇది చూసిన మరో వ్యక్తి చిరుతను అదిలించే ప్రయత్నం చేస్తే అతడిపైనా దాడి చేసి గాయపరిచింది. చిరుత తన ప్రాణ రక్షణ కోసం పోరాడిందనీ, దాని తప్పేమీ లేదనీ నందా తన పోస్టులో పేర్కొన్నారు. ఆ తరువాత అటవీ అధికారులు చిరుతను కాపాడి బంధించి తీసుకువెళ్లారు.