ఏమాత్రం తగ్గని మోడీ ఇమేజ్..!
posted on Nov 16, 2015 @ 10:10AM
బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో మోడీ దూకుడికి ఇక బ్రేకులు పడ్టట్టే అనుకున్నారు. కానీ అది ఊహ మాత్రమే అని తెలిసేలా చేశారు మోడీ మరోసారి. సాధారణంగా మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు మోడీ జపంతో ఊగిపోతారు. అయితే బీహార్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి అలాంటి వాటికి బ్రేక్ పడుతుందనుకున్నారు. కానీ తాజాగా బ్రిటన్ పర్యటనలో ఉన్న మోడీకి మాత్రం ఘన స్వాగతం లభించింది. అంతేకాదు బ్రిటన్ లోని వెంబ్లే బహిరంగ సభలో మోడీ చేసిన ప్రసంగానికి మంచి స్పందన లభించింది. ప్రవాస భారతీయుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నామని.. ప్రవాస భారతీయులు స్వచ్ఛ్ భారత్ కోసం ఎంతో కృషి చేస్తున్నారని.. అహ్మాదాబాద్ నుంచి లండన్ కు డైరెక్ట్ విమాన సర్వీసును డిసెంబరు 15 నుంచి ప్రారంభించబోతున్నామని ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగానికి ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు దీనికి సంబంధించి బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ కూడా తన ట్విట్టర్లో ట్వీట్స్ చేశాడు. బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం అద్భుతమని, ఆయన చేసిన ప్రసంగానికి భారతీయుడుగా గర్విస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. మొత్తానికి బీహార్ ఎన్నికల్లో ఓడిపోయినా కాని మోడీ ఇమేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది.