క్లాస్ రూమ్ లో టీనేజ్ ప్రేమికుల పెళ్లి కలకలం.. టీసీ ఇచ్చి పంపిన ప్రిన్సిపాల్
posted on Dec 3, 2020 @ 11:52AM
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చోటు చేసుకున్న పెళ్లి ఘటన కలకలం సృష్టించింది. ఒక పక్క కాలేజీ నడుస్తున్న సమయంలో ఏకంగా క్లాస్ రూమ్‌లోనే ఇద్దరు మైనర్లు పెళ్లి చేసుకున్నారు. క్లాస్ రూమ్ లోనే అమ్మాయికి పసుపుతాడు కట్టి, నుదిటిపై బొట్టు పెట్టాడు ఆ యువకుడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మైనర్ల వివాహం పోయిన నెల నవంబర్ 17న జరిగినట్లుగా వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో జూనియర్ కాలేజీలో జరిగిన ఈ పెళ్లి వీడియోలు తాజాగా వైరల్ గా మారాయి. ఈ వైరల్ వీడియో, ఫోటోలు కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి వెళ్లడంతో.. విషయం తెలుసుకున్న అయన ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాక వీరితోపాటు వీరికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా ప్రిన్సిపాల్ టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపించివేశారు.
అయితే, తామేమీ నిజమైన పెళ్లి చేసుకోలేదని, కేవలం వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వచ్చే లైక్స్ కోసమే తాము ఈ పని చేశామని వారిద్దరూ చెప్పడం గమనార్హం. ఈ విషయంలో వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చామని కాలేజీ యాజమాన్యం చెపుతుండగా,మరోపక్క తమ పిల్లలు చేసిన పనికి పరువు పోయిందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ వీడియోను తీసింది మరో ఇంటర్ చదివే మరో బాలిక అని తెలుస్తోంది. మధ్యమధ్యలో వాళ్ళిద్దరికీ ఆమె సలహాలు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.