టీడీపీ ఫేక్ పార్టీ.. బాబు గాలి నాయకుడు! అసెంబ్లీలో కొడాలి మాటల రచ్చ
posted on Dec 3, 2020 @ 1:06PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నాలుగో రోజు రచ్చ జరిగింది. అధికార వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎవరో ఒకరి పొత్తు లేకుండా పోటీచేయలేని వ్యక్తి చంద్రబాబని విమర్శించారు. పారిపోయే వారు ఎవరో ప్రజలకు తెలుసన్నారు నాని. 1983లో ఓడిపోయినప్పుడు కాంగ్రెస్‌ను వదిలి చంద్రబాబు పారిపోయారని, అప్పుడు చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ వదిలి పారిపోయారు.. కరోనా రాగానే కాల్వ గట్టు వదిలి పారిపోయారన్నారు. చంద్రబాబు నాయుడు ఫేక్ ప్రతిపక్ష నాయకుడు. టీడీపీ ఫేక్ పార్టీ. చంద్రబాబు నాయుడే గాలి ముఖ్యమంత్రి. బాబే గాలి నాయకుడు. పారిపోయేవాళ్లెవరో ప్రజలందరికీ తెలుసు’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
జగన్ ప్రభుత్వం ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తోందని చెప్పారు కొడాలి నాని. వైఎస్ఆర్ భరోసా పథకం ద్వారా అర్హులందరికీ పింఛన్లు అందిస్తున్నాం.. ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు పింఛన్లు ఇవ్వనున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలపై జరిగిన చర్చలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.3000 పెన్షన్ ఇస్తామన్నారు..? .. అది ఏమైందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు నిమ్మలకు కౌంటరిచ్చి న కొడాలి .. టీడీపీ, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. టీడీపీ హయాంలో మీరు ఎంతిచ్చారో మాకు తెలుసు. మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి. చంద్రబాబు 9ఏళ్ల పాలనలో పెన్షన్‌లో రూపాయి పెంచలేదు. బాబు హయాంలో ఉన్న వాళ్లు ఎవరైనా చనిపోతేనే కొత్త పింఛన్ ఇచ్చేవాళ్లు. వైఎస్సార్ భరోసా పథకం కింద అర్హులకు పెన్షన్లు అందిస్తున్నాం. ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి అన్నారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై సభలో టీడీపీ నిరసన వ్యక్తం చేశారు.