మద్య నిషేధంపై నాలిక మడతేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్
posted on Aug 1, 2022 @ 11:48AM
వైయస్ జగన్.. తన తొలి కేబినెట్‌లో నోరున్న ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు కట్టబెట్టారు. దాంతో వారిలో చాలా మంది.. తమ నోటికి అలా ఇలా కాదు ఓ రేంజ్‌లో పని చెప్పారు. వారిలో కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్.. వంటి వారు వీరిలో ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టినా.. మీడియా ముందుకు వచ్చినా.. ప్రతిపక్ష నేతలపై బండ బూతులు, ఏకవచన ప్రయోగాలతో రెచ్చి పోయారు.
ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. అర్హులకు సన్న బియ్యం ఇస్తామంటూ.. అందుకు అక్షరాల ఏడువందల కోట్ల రూపాయిలతో జగన్ ప్రభుత్వం సంచుల తయారికి ఆర్డర్ సైతం ఇచ్చిందట.. ఆ తర్వాత.. సన్న బియ్యం ఇస్తామని మీ అమ్మ మొగుడు చెప్పాడా? అంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ వీరంగం ఆడిన జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రివర్యులకు దీటుగా జగన్ మలి కేబినెట్‌లో కొన్ని అణిముత్యాలు.. అడపా దడపా తళుక్కుముంటున్నాయి.
తాజాగా అనకాపల్లి ఎమ్మెల్యే కమ్ ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ మద్య నిషేధంపై తన వ్యాఖ్యలతో వార్తలలో ప్రముఖంగా నిలిచారు. గుడివాడ అమరన్నాథ్ ఇటీవల విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. తమ మేనిఫెస్టోలో ఎక్కడా మద్యపాన నిషేధం అన్న మాటేలేదన్నారు. కావాలంటే చూసుకోండంటూ మీడియా వారికి మాన్‌సూన్ బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. ముందు మీరు మా మేనిఫెస్టో చూసి ఆ తరువాత ప్రశ్నించండి అంటూ విపక్షాల పై గయ్యి మన్నారు. మద్యం రేట్లు ఫైవ్‌స్టార్ రేట్లకు మించి తీసుకు వస్తామని.. అలా అయితే మద్యం తాగే వారు మద్యం తాగకుండా ఉంటారంటూ ఆయన లాజిక్‌గా చెప్పుకొచ్చారు. అయినా మేం మేనిఫెస్టోలో పెట్టని మద్య నిషేధాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఎలా ప్రశ్నిస్తారంటూ నిలదీశారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా అక్కడ గోడల మీద మా మేనిఫెస్టో ఉంటుంది.. జాగ్రత్తగా చూడండి. అందులో మద్య నిషేధం ఉందా అని గుడివాడ అమర్నాథ్ విపక్షాలను ప్రశ్నించారు.
మద్యపాన నిషేధంపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్ర గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఆయనకు కౌంటర్ ఇస్తున్నారు. నాటి ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ .. చేసిన పాదయాత్ర సందర్బంగా ఏం చెప్పారు... ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో ఓ సారి పరిశీలించాలంటూ మంత్రి గుడివాడకి వారు సూచిస్తున్నారు. అలాగే మీ పార్టీ మేనిఫెస్టో.. మీరు మీడియా సమావేశం నిర్వహించిన కార్యాలయంలో లేదా ? అంటూ ఈ గుడివాడ అమర్నాథ్‌ను సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే.. మంత్రి గుడివాడ అమరన్నాథ్‌ది అచ్చు తప్పు అంటూ బాలయ్య బాబు సినిమాలోని ఓ డైలాగ్‌తో ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరు అయితే.. జగన్ తొలి కేబినెట్ లో నాని బ్రదర్స్, ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇక ప్రతిపక్ష పార్టీల వారైతే.. నాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్.. శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కర్నూలు, గుంటూరులో పాదయాత్ర సందర్బంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ నాటి పాదయాత్రలో మాట్లాడుతూ.... రాష్ట్రంలో మద్యం తాగుతోన్న భర్తల కారణంగా మహిళలు పుస్తెలు అమ్ముకుని పిల్లలను పెంచుకోవాల్సి వస్తోంది... మీ అన్న.. మీ తమ్ముడు.. మీ మనవడు.. అధికారంలోకి వస్తే.. విడతల వారిగా మద్యంపై నిషేధం విధిస్తామని.. తొలి ఏడాది 25 శాతం.. రెండో ఏడాది మరో 25 శాతం...ఇలా మొత్తంగా అయిదో ఏడు వచ్చేసరికి రాష్ట్రంలో అసలు మద్యం అనేదే లేకుండా చేస్తామంటూ... మీకు మాట ఇస్తున్నా.. అదీ కూడా మద్యం ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా షాక్ కొట్టలా చేస్తామంటూ నాడు చేసిన వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. సదరు వీడియోలు మాత్రం.. సోషల్ మీడియాలో జగనన్న వదిలిన బాణాన్ని మించిన స్పీడ్ లో వైరల్ అవుతున్నాయి.