తెలంగాణ బీజేపీలో స్వామి భక్తి పోటా పోటీ!
posted on Aug 1, 2022 @ 12:00PM
ప్రభువుల వారిని ఆనందపరచడానికి, శాంతపరచడానికి సామంతులు అనేక జిమ్మిక్కులు, కాయకష్టమూ చేయాలి. దేశంలో పరిస్థితుల గురించి వేగుల వలె సమాచారం అందించాలి, ప్రతీ ప్రాంత అభివృద్ధితో పాటు అస్మదీయులు, తస్మదీయుల వివరాలు చెబుతూండాలి. కొందరు రాజాజ్ఞను పాటించాలంటూ జనాల్లో తిరుగుతూ హెచ్చరికలూ చేస్తుంటారు. మరికొందరు జాగ్రత్తలు చెబుతూంటారు. ఆనక యుద్ధమో, మరో శుభకార్యమో వస్తే తన వారిని ఆహ్వానించడానికి ఇవన్నీ అవసరం. ప్రస్తుతం బీజేపీ తెలంగాణా నేత ఈటెల అదే పనిలో ఉన్నారు.
ఇప్పటికే తెలంగాణాలో బండి సంజయ్ బీజేపీ వారి దేశ భక్తిని పాటించాలంటూ దాదాపు హెచ్చరికల్లాంటి భాషణ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ప్రజలు ఆగస్టు పదిహేను నాటికి ఏమేమి చేయాలో కూడా చెప్పేందుకు పూనుకున్నారు. కాగా, తెలంగాణా జిల్లాల్లో పర్యటనకు సంజయ్ సిద్ధమయ్యారు. మరో వంక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అలాంటి ప్రచారాన్ని చేయడంలోనే మనసు పెట్టారు.ఇటీవల ఆంధ్రా గుంటూరు జిల్లాకి వెళ్లినపుడు కూడా పింగళి వెంకయ్య కుటుంబాన్ని పలకరించడంతోపాటు సభ లో ప్రజలు దేశభక్తిని ఎలా చూపాలన్నదీ శెలవిచ్చారు.
ఇలా ఉండగా, ఈటెల రాజేందర్, డి.కె ఆరుణ వంటి తెలంగాణా నేతలు మాత్రం తెలంగాణాలో బీజేపీలోకి చేరికల గురించిన వాస్తవ నివేదికను కేంద్రానికి సమర్పించడానికి హస్తిన యానానికి సిద్ధమయ్యారు. ఈటెల జాబితాలో చాలామంది కాంగ్రెస్, టీఆర్ ఎస్ నేతలూ ఉన్నారని భారీ ప్రచార మూ చేసుకుంటున్నారు. బీజేపీలో చేరాలని ఉత్సాహం ప్రదర్శిస్తున్నవారు బడి మారినట్టు అమాంతం వచ్చేయలేరు. వారు ఇబ్బందులు దాటి రావలసి వస్తుంది గనుక అందుకు చేరికల కమిటీ కన్వీనర్‌గానూ ఉన్న ఈటెల కొంత సమయం ఇవ్వాల్సి ఉంది. కానీ ఖచ్చితంగా పార్టీలోకి జంప్ అయ్యేవారు మాత్రం తన జాబితాలో ఉన్నారనే ఆయన అంటున్నారు.
ఈ జాబితాతో కేంద్రంలో బీజేపీ సీనియర్ నేతలతో శభాష్ అనిపించుకోవాలన్న ఆతృతలో ఈటెల, డికే అరుణా ఉన్నారన్నది స్పష్టం. కేసీఆర్ పై యుద్ధం చేయడానికి సిద్ధపడినపుడు కేంద్రం నుంచి గట్టి మద్దతు అవసరం గనుక వారి ఆదేశాలను పాటించడం తో పాటు వారి మెప్పు పొందడానికి జాబితాతో ప్రయాణమయ్యారన్నది విశ్లేషకుల మాట. బీజేపీ జాతీయ నాయకుల అనుమతి పొంది రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలన్న ఉత్సాహంలో ఈటెల ఉన్నారనాలి.