హిందుత్వ పార్టీ శివసేనకు జై కొట్టిన ఎంఐఎం
posted on Mar 19, 2021 8:28AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎంఐఎం పార్టీకి పూర్తిగా మైనార్టీ ముద్ర ఉంది. మైనార్టీల కేంద్రంగానే ఆ పార్టీ కార్యక్రమాలు ఉంటాయి. దేశంలో ఎక్కడ ఏం జరిగినా హిందూ సంఘాలను, బీజేపీని టార్గెట్ చేస్తుంటారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీది హిందుత్వ నినాదమే అయినా బీజేపీ కంటే బలంగా హిందుత్వ నినాదం వినిపించేంది శివసేన. బీజేపీ నేతల కంటే శివసేన నేతలే ఈ విషయంలో చాలా దూకుడుగా ఉంటారు. గతంలో ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయి.
అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం సంచలనం సమీకరణలు జరిగాయి. అందిరి అంచనాలు తలకిందులు చేస్తూ శివసేనకు ఎంఐఎం బహిరంగంగానే సపోర్ట్ చేసింది. జలగావ్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో శివసేన అభ్యర్థి జయ్‌శ్రీ మహాజన్ విజయం సాధించారు.ఇక్కడ
బీజేపీకి 75 మంది కార్పొరేటర్లు ఉండగా, శివసేనకు ఉన్నది 15 మందే. అయితే, బీజేపీకి చెందిన 27 మంది ప్లేటు పిరాయించి శివసేనకు ఓటు వేశారు. అలాగే ఎంఐఎంకు చెందిన ముగ్గురు కూడా శివసేనకే ఓటు వేయడంతో ఆ పార్టీకి 45 ఓట్లు పోలయ్యాయి.దీంతో ఎంఐఎం మద్దతుతో జలగావ్ మున్సిపాలిటీని శివసేన గెలుచుకుంది.
మరోవైపు మహారాష్ట్రలో బీజేపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. అత్యధికమంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ రెండు చోట్ల ఆ పార్టీ మేయర్ పదవిని కోల్పోయింది. జలగావ్ లో బీజేపీకి 75 మంది కార్పొరేటర్లు ఉన్నా... ఆ పార్టీ మేయర్ అభ్యర్థి ప్రతిభా కప్సేకు 30 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఫలితంగా జయ్‌శ్రీ మహాజన్ మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ పదవి కూడా ఆ పార్టీకే దక్కింది. ఆ పార్టీ అభ్యర్థి కుల్‌భూషణ్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇక గత నెలలో జరిగిన సంగి మేయర్ ఎన్నికల్లోనూ బీజేపీకి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అక్కడ బీజేపీకి అత్యధికంగా 41 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ మేయర్ పీఠాన్ని ఎన్సీపీకి కోల్పోయింది.