మమత, అఖిలేష్ స్వరం మారింది.. ఆదే దారిలో మరింత మంది!
posted on May 17, 2023 @ 2:33PM
తెలుగువన్ చెప్పినట్లే జరుగుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం జాతీయ స్థాయిలో సమీకరణాలు మార్చేస్తుందని తెలుగువన్ సరిగ్గా అంచనా వేసింది. కర్నాటకలో కాంగ్రెస్ విజయం బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్ గొడుకు కింద ఐక్యతారాగం ఆలపించేందుకు ప్రేరేపిస్తుందని తెలుగువన్ ముందుగానే చెప్పింది. ఆ విధంగానే కర్నాటక ఫలితం వచ్చిన రెండో రోజు నుంచే విపక్షాల ఐక్యతారాగంలో మార్పు కనిపించింది. క
ర్నాటక ఫలితానికి ముందు వరకూ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ వచ్చిన పార్టీలు.. కాంగ్రెస్సేతర అనే మాటను వెనక్కు తీసుకున్నాయి. బీజేపీయేతర కూటమి అంటూ తమ గొంతు సవరించుకున్నాయి. ముందుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల తాము ఆ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించింది.
అంతకు ముందు వరకూ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ చెవినిల్లు కట్లుకుని ప్రచారం చేసిన మమతా బెనర్జీ కర్నాటక ఫలితంతో స్వరం మార్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ను గద్దె దించాలంటే కాంగ్రెస్ సహకారం తప్పని సరి అని గుర్తించారు. ఇప్పటికే యూపీయే కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ వెనుక చేరడానికి మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకు వేశారు. ఆ తరువాత ఒక రోజు వ్యవధిలోనే సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ కు మద్దతుగా గొంతు కలిపారు. మమతా బెనర్జీ అభిప్రాయంతో తాను వంద శాతం ఏకీభవిస్తున్నానని ప్రకటించారు. 2024 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేయాల్సి ఉందని, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంటే అక్కడే పోటీ చేయాలని అభిప్రాయపడ్డారు. బిహార్, తెలంగాణ ముఖ్యమంత్రులు నీతీశ్ కుమార్, కేసీఆర్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నచోట ఆ పార్టీకే మద్దతిస్తామని మమత సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
కర్ణాటకలో కాంగ్రెస్ సంతృప్తికర విజయంతో అధికారాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో ఆ పార్టీ అటు ప్రజలతో పాటు..ఇటు తోటి ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఓ ప్రత్యేక ఇమేజ్ సంతరించుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సక్సెస్ ఫలితంగానే ఇది సాధ్యపడిందని పార్టీ శ్రేణులు సంబర పడుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేందుకు పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలకు పెరుగుతున్న గ్రాఫ్ ఓ మంచి టానిక్కులా పని చేస్తుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.