కోట్లు కుమ్మరిస్తున్న కేసీఆర్..!
posted on May 17, 2023 @ 2:50PM
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. అలాంటి దేశంలో ఎంతగా ప్రచారం చేసుకోంటే.. అంతగా ఎన్నికల్లో గెలుస్తామనే ఓ విధమైన భావన రాజకీయ పార్టీల్లో బలంగా ఉంది. తాజాగా అటువంటి ప్రయత్నానికి తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ తెర తీసింది. జూన్ 2వ తేదీ అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి 21 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు భారీ ప్రణాళికలు సిద్దం చేసింది. అదీకాక ఎన్నికలు సమీపిస్తున్నాయి... ఆపై తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.
ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసేలా.. ప్రచారం చేసేందుకు దేశంలోని మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయిలు వెచ్చించనుంది. అందుకోసం దాదాపు 200 కోట్ల రూపాయిలను ప్రభుత్వం కేటాయించింది.. అందులో 70 కోట్ల రూపాయిలు ప్రచారానికి వినియోగించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ఠయాన్ని విపక్షాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అంతే కాదు ప్రజల సొమ్ముతో ప్రభుత్వం పండగ చేసుకొంటోందని విమర్శలు సంధిస్తున్నాయి.
మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలి రెండేళ్లలో ఆవిర్భావ ఉత్సవాల పేరిట కేసీఆర్ సర్కార్ చేసిన హడావుడి కనిపించినప్పటికీ ఆ తర్వాత ఆ వేడుకలను నామ్ కే వాస్తే అన్నట్లుగా నిర్వహించారు.. అయితే తొలి రెండేళ్లలో 5 రోజులు, ఆ తర్వాత వాటిని మూడు రోజులకు కుదించారని.. అనంతరం ఆ వేడుకలను ఒక రోజుకు పరిమితం చేసి.. మమ అనిపించిందని విపక్షాలు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నాయి.
అయితే ఈ ఏడాది ఎన్నికల ఏడాది కావడంతో.. 21 రోజులు పాటు రాష్ట్ర ఆవతరణ ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ నిర్ణయం పై రాజకీయ పార్టీలలోనే కాదు.. సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర అవతరణ దితోత్సవ వేడుకల కోసం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్..మొత్తం 33 జిల్లాలకు రెండు నుంచి మూడు కోట్ల రూపాయిల నిధులు కేటాయించారనే వార్త సైతం హల్ చల్ చేస్తోంది. ఇక ఈ వేడుకలను పురస్కరించుకొని.. భారీగా డాక్యుమెంటరీలు సైతం నిర్మిస్తున్నారని తెలుస్తోంది.
అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతోపాటు ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో గెలవడం కోసం కేసీఆర్ ప్రచారార్భాటాన్ని పీక్స్ కు తీసుకెడుతున్నారన్న విమర్శలూ, వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. మరోవైపు పక్కనే ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీకి అక్కడి ఓటర్లు గట్టిగానే షాక్ ఇచ్చారు. అలాగే తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఇంకోవైపు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ , కాసాని జ్జానేశ్వర్ నేతృత్వంలోని టీటీడీపీ సైతం ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ మరో సారి అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే ఏటికి ఎదురీదక తప్పని పరిస్థితులు ఉన్నాయి.