ఉపవాసం ఇలా చేసి చూడండి

శివరాత్రి అనగానే ఉపవాసం గుర్తుకువస్తుంది. ఉపవాసం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు... ఆధ్యాత్మికంగానూ, ఆరోగ్యపరంగానూ అది చేకూర్చే లాభం అసమాన్యం. అలాంటి ఉపవాసాన్ని చేసేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదంటున్నారు నిపుణులు.

 

- చాలామంది రేపు ఉపవాసం అనగానే ముందురోజు రాత్రి సుష్టుగా భోజనం చేస్తారు. ఇదేమంత మంచి పద్ధతి కాదు. శరీరాన్ని నిదానంగా ఉపవాసాన్ని సిద్ధపరచడం ముఖ్యం. అందుకే మన పెద్దలు ఏకాదశి రోజు ఉపవాసం చేయాలంటే దశమి రాత్రి నుంచే మొదలుపెట్టాలనీ, శివరాత్రి ఉపవాసాన్ని కూడా ముందురోజు నుంచే ఆరంభించాలనీ చెబుతుంటారు.

 

- ఉపవాసం ఉండటం మంచిదే! కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండితీరాలన్న నియమం ఏదీ లేదు. షుగర్ వ్యాధి ఉన్నవారు, వృద్ధులు, బాలింతలు, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడేవారు, విపరీతంగా కాయకష్టం చేసే పనిలో ఉండేవారు ఉపవాసం ఉండటం వల్ల లేనిపోని సమస్యలు రావచ్చు.

 

- స్వల్ప వ్యాయామం చేసినా కానీ మనకి తెలియకుండానే శరీరంలోని శక్తంతా దహించుకుపోతుంది. దానిని తిరిగి భర్తీ చేసేందుకు తగిన ఆహారం అందదు కాబట్టి నిస్సత్తువ, కళ్లు తిరగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఉపవాసం చేసే రోజున వ్యాయామానికి సెలవివ్వడం మంచిది.

 

- శరీరానికి ఆహారం ద్వారా ఎంతో కొంత నీరు అందుతూ ఉంటుంది. ఉపవాసం రోజున ఆ అవకాశం ఉండదు కాబట్టి, ఎక్కువ మంచినీటితో ఆ లోటుని భర్తీ చేయవలసి ఉంటుంది. తద్వారా డీహైడ్రేషన్‌కు లోనయ్యే ప్రమాదం రాదు. ఇక ఉపవాసం రోజున జీర్ణవ్యవస్థ ఖాళీగా ఉంటుంది కాబట్టి, అందులోకి చేరిన నీరు పేగులను శుద్ధి చేసే అవకాశం దక్కుతుంది. అందుకనే ఉపవాసపు రోజున ఎప్పటికప్పుడు తగినంత నీరు తాగుతూ ఉండాలి.

 

- ఆహారం లేకుండా పూట గడవని మనకి ఉపవాసం నిజంగా ఓ పరీక్షే! అందుకే ఎలాంటి నీరసానికి లోనవకుండా ఉండాలంటే తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తీసుకోమని సూచిస్తున్నారు. పెద్దగా జీర్ణప్రక్రియ అవసరం లేకుండానే తేనె మన శరీరానికి తక్షణశక్తిని అందిస్తుంది. ఇక నిమ్మరసం సత్తువని కలిగిస్తుంది.

 

- ఉపవాసం ఉన్న రోజున ఏదో ఒక వ్యాపకంలో మునిగితేలండి. శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టకుండా మనసు మాత్రమే నిశ్చలంగా ఉండే పనిలో నిమగ్నమవ్వండి. ఏదన్నా పుస్తకం చదవడమో, ప్రసంగాలు వినడమో, ధ్యానంలో గడపడమో చేయడం వల్ల ఉపవాసానికి మంచి ఫలితం దక్కుతుంది.

 

- చాలామంది ఉపవాసం చేసే రోజు విపరీతంగా కాఫీ,టీ, సిగిరెట్లు తాగేస్తుంటారు. ఇలా చేయడంకంటే ఉపవాసం ఉండకపోవడమే మేలంటున్నారు వైద్యులు. వీలైతే రోజూ తాగే కాఫీ, టీలు కూడా మానేయమని చెబుతుంటారు. దీని వల్ల కొందరికి తలనొప్పి వచ్చినా అది తాత్కాలికమే కాబట్టి ఓపికపట్టమని సూచిస్తున్నారు.

 

- ఉపవాసం అంటే పూర్తిగా ఆహారాన్ని నిషేధించాలని ఏమీ లేదు. పాలు, పండ్లు వంటి అపక్వమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉపవాసాన్ని సాగించడం వల్ల కూడా ఎంతోకొంత ఫలితం ఉంటుంది. ఉపవాసాన్ని విరమించే సమయంలో కూడా ఒక్కసారిగా జీర్ణవ్యవస్థ మీద భారం కలగకుండా ఉండేందుకు ఇలాంటి తేలికపాటి ఆహారాన్నే తీసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. యాపిల్‌, కమల, అరటిపండు, పుచ్చకాయలు, ఖర్జూరాలు, పాలు, గ్రీన్‌టీ వంటి ఆహారం జీర్ణవ్యవస్థకి పెద్దగా పని కల్పించకుండానే శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంటాయి.

 

 

- నిర్జర.