మృత్యువుని దూరం చేసే బిల్వదళాలు


శివరాత్రి వచ్చిందంటే నీటితో అభిషేకం, బిల్వపత్రాలతో అర్చనా గుర్తుకువస్తాయి. శివుని ఎన్ని విధాలా పూజించినా, అందులో బిల్వ పత్రం లేనిదే మనసుకి లోటుగానే ఉంటుంది. మరి ఆ పరమేశ్వరునికే ప్రీతిపాత్రమైనదంటే... బిల్వ పత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండే ఉంటాయి కదా! వాటిలో కొన్ని...

 

- బిల్వవృక్షంగా పిలుచుకునే మారేడు చెట్టు మన దేశంలోనే ఉద్భవించిందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ చెట్టు -7 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకూ ఎలాంటి వాతావరణాన్నయినా తట్టుకుని ఎంతటి నేలలో అయినా ఎదుగుతుంది. కాబట్టి ఊరూరా కనిపించే ఆ బిల్వదళాలు అటు అర్చనకే కాదు ఇటు ఆయుర్వేదంలోనూ విస్తృతంగా వినియోగించేవారు.

 

- గాలి, వెలుతురు సరిగా సోకని గర్భగుడులలోని తేమకి రకరకాల సూక్ష్మక్రిములు చేరుకుంటాయి. కానీ అక్కడ శివలింగం చెంతన ఉండే బిల్వదళాలు అక్కడి వాతావరణాన్ని మార్చేస్తాయి. మిగతా ఆకులతో పోలిస్తే బిల్వదళాలు రోజుల తరబడి తాజాగా ఉంటాయి. పైగా సూక్ష్మక్రిములను సంహరించే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు వీటి సొంతం. కాబట్టి గర్భగుడిని నిరంతరం పరిమళభరితంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో బిల్వానిది గొప్ప పాత్ర!

 

 

- చక్కెర వ్యాధికి బిల్వం గొప్ప ఔషధం. బిల్వపత్రాల నుంచి తీసిన రసాన్ని కానీ, ఆ పత్రాలను ఎండించి చేసిన పొడిన కానీ తీసుకుంటే చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయట. వగరుగా ఉండే బిల్వ ఫలాలని తిన్నా కూడా చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.

 

- జీర్ణ సంబంధమైన అనేక వ్యాధులకు మారేడు ఫలాలు, దళాలు ఉపయోగపడతాయి. మలబద్ధకం, అతిసారం, ఆకలి లేకపోవడం, పేగులలో పుండ్లు, ఎసిడిటీ వంటి సమస్తమైన సమస్యలలోనూ బిల్వం ప్రభావవంతంగా పనిచేస్తుంది.

 

 

 

- బిల్వపత్రాలకి యాంటీఫంగల్ లక్షణం ఉంది. ఆ కారణంగా వీటి రసాన్ని శరీరానికి రాసుకుంటే ఎలాంటి దుర్వాసనా రాకుండా కాపాడతాయి. అంతేకాదు! గాయాలు త్వరగా మానాలన్నా, వాపులు తగ్గాలన్నా కూడా బిల్వపత్రాల నుంచి తీసిన రసాయనం పైపూతగా రాస్తే సరి!

 

- మారేడు ఫలాల నుంచి తీసిన గుజ్జుతో చేసిన పానీయంతో శరీరం చల్లగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ కూడా మెరుగవుతుంది. మనవైపు తక్కువ కానీ ఇలా మారేడు పండ్లతో పానీయాలు, షర్బత్లు చేసుకునే అలవాటు ఒడిషా, బెంగాల్ ప్రాంతాలలో ఇంటింటా కనిపిస్తుంది.

 

- బిల్వ పత్రాలలో కనిపించే Aegeline అనే రసాయం చక్కెర నిల్వలను అదుపులో ఉంచడంలోనూ, రక్తపోటుని నియంత్రించడంలోనూ, కొవ్వుని తగ్గించడంలోనూ ఉపయోగపడుతుందనే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.

 

మారేడు పూలు, పత్రాలు, బెరడు, వేళ్లు....  ఇలా మారేడు వృక్షంలోని అణువణువుకీ ఆరోగ్యాన్ని అందించే లక్షణం ఉంది. అందుకనేనేమో మారేడు వృక్షం సాక్షాత్తు ఆ పరమేశ్వరుని స్వరూపం అని చెబుతారు. మూడు ఆకులుగా ఉండే ఆ దళంలో ఆయన త్రినేత్రాలను దర్శిస్తారు. ఎలాంటి ఆరోగ్య సమస్యనయినా మారేడు దూరం చేయగలదు కాబట్టే దానికి ‘మృత్యు వంచనము’ అనే పర్యాయపదం కూడా ఉంది. కేవలం శైవారాధనలోనే కాకుండా వినాయకచవితినాడు పూజించే ఏకవింశతి పత్రాలలో మారేడు కూడా చోటు చేసుకుంది. అంతదాకా ఎందుకు! మారేడు విశిష్టతను ఎరిగిన మన పెద్దలు బిల్వాష్టకం పేరుతో ఒక స్త్రోత్రాన్నే రూపొందించుకున్నారు.

- నిర్జర.