కారెక్కు.. రాష్ట్ర పదవి పట్టు! బీజేపీకి ఎర్ర శేఖర్ బైబై
posted on Feb 13, 2021 @ 9:54AM
తెలంగాణలో ప్రస్తుతం దూకుడుగా వెళుతోంది బీజేపీ. వరుస విజయాలతో ఆ పార్టీలోకి వలసలు పెరిగిపోయాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలు కమలం కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బండి సంజయ్ టీమ్ పావులు కదుపుతోంది. అయితే యమ జోరు మీదున్న బీజేపీకి బ్రేకులు వేసేందుకు గులాబీ బాస్ వ్యూహాలు రెడీ చేస్తున్నారు. అందులో భాగంగానే కమలానికి కౌంటర్ గా ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో చేరితే రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తామని, వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని అధికార పార్టీ హామీలు ఇస్తుందట. కేసీఆర్ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని, త్వరలో బీజేపీకి షాక్ తగలబోతోందని సమాచారం.
మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది. జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా అంటూ ఇటీవల ఓసారి రాష్ట్ర నాయకత్వానికి ఝలక్ ఇచ్చి మళ్లీ వెనక్కి తగ్గిన ఎర్రశేఖర్.. ఈసారి పార్టీ వీడేందుకు బలంగా ఫిక్స్ అయ్యారని చెబుతున్నారు. పదవిలో కొనసాగలేకపోతున్న.. నా స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వండి.. అంటూ తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఎర్ర శేఖర్ సమాచారం చేరవేశారని తెలిసింది.
జిల్లా బీజేపీ నేతలకు అప్పుడే రాజీనామా విషయం తెలియకూడదని ఓ వైపు జాగ్రత్తపడుతూనే.. మరోవైపు టీఆర్ఎస్ బడా నేతలతో ఎర్ర శేఖర్ టచ్‌లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే వారితో మాటా ముచ్చట జరిగిపోయాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మాజీ ఎమ్మెల్యే గులాబీ గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది. టీఆర్ఎస్‌లో చేరాలంటే తనకేంటి అని అడగడంతో.. ఓ పెద్ద పోస్టే ఇస్తామని గులాబీ పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టుగా విశ్వసనీయ సమాచారం. అది కూడా ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలని ఆయన టిఆర్ఎస్ అధిష్టానం ముందు తన కోరికను వెలిబుచ్చినట్టుగా తెలిసింది. ఈ నెలలోనే ఓ మంచి ముహూర్తం చూసుకొని ఎర్రశేఖర్ గులాబి గూటికి జంప్ కావడం ఖాయమని అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో బీసీ నేతగా ఎర్ర శేఖర్ కు మంచి పట్టుంది. గతంలో టీడీపీలో పని చేసిన శేఖర్ కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేడర్ ఉంది. అందుకే ఎర్ర శేఖర్ కు రాష్ట్ర స్థాయి కీలక పదవిని కేసీఆర్ ఆఫర్ చేశారని తెలుస్తోంది.
గత డిసెంబర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించినప్పుడే ఎర్రశేఖర్ వ్వవహరం వివాదాస్పదమైంది. సంజయ్ జిల్లాలో ఉండగానే ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. జిల్లాలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో ఆయన పొసగడం లేదని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. సంజయ్ టూర్ లో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని భావించిన శేఖర్.. అప్పటికప్పుడే రాజీనామా ప్రకటన చేశారు. తన రాజీనామాకు కారణం గ్రూప్ రాజకీయాలేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. బండి సంజయ్ జోక్యం చేసుకుని మాట్లాడటంతో తన రాజీనామాపై వెనక్కి తగ్గారు శేఖర్. ఇప్పుడు తాజాగా మళ్లీ రాజీనామాకు సిద్ధమయ్యారు.