తుపాకీ పెట్టి బెదిరించిన సీఐ! వైసీపీ ఎమ్మెల్యే కోసం బరి తెగింపు
posted on Feb 13, 2021 7:28AM
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది.మూడి విడత ఎన్నికల నామినేషన్లు ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో ఆ ప్రాంతాల్లో ప్రచారం తారా స్థాయిలో జరుగుతోంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రజా ప్రతినిధుల బెదిరింపులు ఆగడం లేదని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలకు మద్దతుగా పోలీసు అధికారులు.. పోటీలో ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా
రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత.. సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.
సీఐ కృష్ణయ్య తుపాకీ పెట్టి చంపుతానని బెదిరించాడని ఆరోపిస్తూ సీఎం జగన్‌కు రొంపిచెర్ల మార్కెట్ యార్డు ఛైర్మన్ అంజయ్య సెల్ఫీ వీడియో పంపారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి టీడీపీకి పని చేసిన వారిని గోగులపాడు సర్పంచ్‌గా నిలబెట్టారని... తొలి నుంచి వైసీపీలో ఉన్న తాము కూడా పోటీకి దిగామని తెలిపారు. పోటీ నుంచి తప్పుకోవాలని సీఐ కృష్ణయ్యతో ఎమ్మెల్యే గోపిరెడ్డి వేధించారని వాపోయారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, సీఐ కృష్ణయ్య నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలని వేడుకుంటూ అంజయ్య వీడియోలో సీఎం జగన్‌ను వేడుకున్నారు.
గోగులపాడు వైసీపీ సర్పంచ్ రెబల్ అభ్యర్థిగా అంజయ్య పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో అంజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేనల్లుడు లక్ష్మీ నారాయణ రాజకీయ వత్తిడితో తన భర్తని నరసరావుపేట టూ టౌన్ సీఐ కృష్ణయ్య తీసుకెళ్లారని అంజయ్య భార్య లక్ష్మీ ఆరోపిస్తున్నారు. అయితే సమయం ముగిసినా అంజయ్య ప్రచారం చేయడంతో అదుపులోకి తీసుకున్నామని రొంపిచర్ల పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో అంజయ్య సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. వైసీపీ నేతలను కూడా ఎమ్మెల్యే బెదిరిస్తుండటం నర్సరావుపేట నియోజకవర్గంలో చర్చగా మారింది.