జగన్ ప్రభుత్వంపై మాధవ్ పూరించిన సమరశంఖం
posted on Oct 11, 2023 @ 2:32PM
అమరావతి లేదు... పోలవరం నిర్మాణం పూర్తి కావడం లేదు.. ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా? అలాగే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏదైనా ఉందా? అంటే ఏదీ లేదు. మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రమేయం ఉందంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో.. ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమంటూ.. దేశ విదేశాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆందోళనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. అలాంటి వేళ చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయమంటూ.. యువ గాయకుడు అదీ కూడా అంధుడు మాధవ్.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై ఆంధ్రజాతి మేలుకోవాలని పిలుపునిస్తూ.. కళ్లు తెరవరా ఆంధ్రుడా.. అంటూ తన గళంతో నిరసన వ్యక్తం చేస్తూ.. ఆలపించిన గీతం.. సోషల్ మీడియాలో కృష్ణుడు వదిలిన సుదర్శన చక్రంలా దూసుకుపోతోంది.
మాధవ్ స్వయంగా రాసి.. ఆలపించిన ఈ వీడియో కేవలం 24 గంటల్లోనే.. 5 లక్షల వ్యూస్‌ని దాటి 10 లక్షల వ్యూస్ వైపు పరుగులు పెడుతోంటే.. 5 వేల మందికిపైగా నెటిజన్లు.. ఈ వీడియోని షేర్ చేసి.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమంటూనే.. ఈ సైకో పాలనకు చరమగీతం పాడే విధంగా అందరు కలిసి రండి.. కదిలి రండి అన్నట్లుగా ఈ వీడియోకు వస్తున్న ఆదరణ చూస్తే అర్థమవుతోందనే ఓ ప్రచారం సైతం సోషల్ మీడియాలో ఊపందుకొంది.
మాధవ్ ఆలపించిన గీతంలో.. నాకు కంటి చూపు లేదు.. కనిపించేదంతా చీకటే.. అయినా నా రాష్ట్రంలో జరుతున్న అన్యాయం కనిపిస్తోంది. ఆరాచకం వినిపిస్తోంది... నియంత నుంచి నా రాష్ట్రాన్ని కాపాడుకోమని నా రక్తంలో ప్రతి అణవణువు ఉద్వేగంలో రగిలిపోతుంది. కానీ.. మీరు కళ్లుండీ.. జరుగుతున్న రాక్షసత్వాన్ని, నియంతృత్వాన్ని ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఎందుకు బండరాయిలా ఉండిపోయారు? భయంతోనా? దారుణాల్ని చూస్తున్న మీ కళ్లలో విప్లవ జ్వాలలు రగలవెందుకు? ఆ జ్వాలల్లో నియంతృత్వాన్ని బూడిద చేయ్యరెందుకు? కళ్లు లేక చీకటిని చూస్తున్న నేను వెలుగును చూడాలనుకుంటున్నాను.. కళ్లుండి వెలుగును చూడగలిగిన మీరు పిరికితనంతో చీకటిని స్వాగతిస్తున్నారు. మీరు చేస్తున్నది నేరం. భావితరాల భవిష్యత్తుకు మీ పిరికితనం ఒక శాపం. మా నిర్లక్ష్యాన్ని, భయాన్ని చూసి నా హృదయం నుంచి పుట్టిన పాట ఇది. ప్రతి అక్షరం ఒక ఉద్వేగం. ప్రతి భావం ఒక విన్నపం. వినండి... చూడండి.. తెలుగోడి పౌరుషాన్ని నిద్ర లేపండి.. అనే ఉపోద్ఘాతంతో మొదలవుతోన్న ఈ గీతం..
ఏమి రాష్ట్రం... ఏమి రాజ్యం.. ఇక్కడున్నది రాక్షసత్వం.. ఎదిరిస్తే చచ్చినట్టే ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తే బతుకేది ఈ రాజ్యంలో! రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను హరిస్తుంటే.. గొంతెత్తిన వాళ్ల గొంతు నులిమేస్తుంటే.. రాష్ట్రం నలుగుతున్నది నియంత చేతిలో.. రావణ కాష్టమవుతున్నది రాక్షస ఒడిలో అంటూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను మాధవ్ కళ్లకు కట్టినట్లు అక్షర బద్దం చేశారు.
అలాగే రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని వివరిస్తూ.. ఈ బతుకులు మనకిచ్చినది అమ్మనాన్నలైతే.. ఈ భవితను మనకిచ్చినది చంద్రబాబు మాత్రమే.. ఈ ఆంధ్రదేశాన్ని అభివృద్ధి పదము నందు నడిపిన మన నాయకుడు చంద్రబాబు మాత్రమే.. అలాంటి మన చంద్రన్నను నీచులంతా హింసిస్తూ దగా చేస్తూ ఉంటే.. చూస్తునే ఉంటావా! నువ్వు తినే మెతుకును ఒక్కసారి అడగలేవా.. సహించకు, సహించకు ఆంధ్రుడా.. ఆంధ్రమాత రక్తాశ్రువులను చిందిస్తున్నది.. నోరు మెదపరా ఓ ఆంధ్రుడా అంటూ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై తిరగబడాలంటూ మాధవ్.. తన మనస్సు పెట్టి రాసిన ఈ గీతం ద్వారా పిలుపు నిచ్చారు. ఈ గీతానికి కామెంట్లు సైతం వెల్లువెత్తాయి.. ఈ గీతం ప్రజలనే కాదు.. పాలక పక్షన్నా సైతం ఆలోచింప చేసేదిగా ఉందనే ఓ చర్చ సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.