చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపే.. ఇండియన్ లీగల్ సంచలన కథనం!
posted on Oct 11, 2023 @ 2:58PM
ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమా, సక్రమమా.. చంద్రబాబు నిజంగానే తప్పు చేశారా? లేక ఉద్దేశ్యపూర్వకంగానే ఇరికించారా అంటే తెలుగు రాష్ట్రాలలో చంటి పిల్లల నుండి వయోవృద్ధుల వరకూ అందరూ ముక్తకంఠంతో చెప్పే మాట ఒక్కటే. చంద్రబాబు అరెస్ట్ అక్రమం.. ఆయనను రాజకీయ కక్షతోనే కేసులో ఇరికించారు అని. విద్యార్థుల నుండి మేధావుల వరకూ.. రిటైర్డ్ అధికారుల నుండి మాజీ న్యాయమూర్తుల వరకూ అందరిదీ ఇదే మాట. ఈ కేసులో చంద్రబాబు పాత్ర లేదు.. ఆయన అరెస్ట్ అక్రమం అంటూ.. ఒక్క వైసీపీ తప్ప రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. ఇప్పటికే ఈ విషయంపై వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ జాతీయ పార్టీలన్నీ ఖండించాయి. ఏపీలో వైసీపీ అరాచకాలు శృతిమించిపోతున్నాయని హెచ్చరించాయి.
ఇప్పుడు తాజాగా ఇదే అంశంపై ఓ జాతీయ మీడియా సంస్థ సంచలన కథనాన్ని ప్రచురించింది. న్యాయ వ్యవస్థ, అందులోని కోణాలను విశ్లేషించే ప్రముఖ పత్రిక ఇండియాలీగల్ చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా ఇరికించారంటూ సంచలన కథనాన్ని ప్రచురించింది. రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఎంతలా ఉపయోగించుకుంటున్నారనడానికి చంద్రబాబు అరెస్ట్ ఒక నిదర్శమని ఇండియా లీగల్ వెల్లడించింది. చంద్రబాబు మరో బలిపశువా అనే శీర్షికతో ప్రచురించిన ఈ కథనం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో అరెస్ట్ అవడమనేది కొత్తేమీ కాదని.. గతంలో చాలా మంది అరెస్ట్ అయ్యారని పేర్కొంది. చంద్రబాబుపై కేసును సుప్రీం కోర్టు జాతీయాంశంగా పేర్కొనాలని ఇండియా లీగల్ తన కథనంలో కోరింది. రాజకీయ నేతల చేతుల్లో పోలీసులు తొత్తులుగా మారారని, ఇలాగే పోలీసులు మితిమీరి ప్రవర్తించిన సందర్భాలలో గతంలో కోర్టులు రంగప్రవేశం చేసిన విషయాన్ని గుర్తు చేసింది.
ఈ కేసును విశ్లేషిస్తూ.. అసలు చంద్రబాబును అరెస్ట్ చేశాక.. ఆధారాల కోసం యత్నించడమేంటని తీవ్రంగా తప్పు బట్టింది. ఏపీలో ప్రజలు అనుమానిస్తున్నట్లే బీజేపీ పాత్రను కూడా ఈ కథనంలో పేర్కొనడం విశేషం. చంద్రబాబు బీజేపీతో స్నేహంగా ఉంటే ఆయనపై ఈ కేసు ఉండేది కాదన్న ఇండియా లీగల్.. మొత్తానికి చంద్రబాబును కావాలని రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారని పేర్కొంది. ఇప్పుడు ఈ ఇండియా లీగల్ కథనంతో ఈ అంశంపై జాతీయ స్థాయిలో మరింత విస్తృతంగా చర్చ జరగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ పరిశీలకులతో పాటు న్యాయ నిపుణుల విశ్లేషణలతో సాగే ఇండియా లీగల్ ఈ కథనాన్ని ప్రచురించడం తెలుగు తమ్ముళ్ల వాదనకు బలం చేకూర్చింది. చంద్రబాబును జైలుకు తరలించి నెల రోజులు గడిచినా ఇప్పటి వరకూ ఈ కేసు విషయంలో కోర్టులు ఏదీ తేల్చకపోవడం.. ఇప్పుడు ఇలా సంచలన కథనాలు రావడం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడటం ఖాయమని అంటున్నారు.
నిజానికి జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి మాట మరిచి కక్షలు కార్పణ్యాలకు తెరదీసిన సంగతి తెలిసిందే. తనను ప్రశ్నించిన వారి నామరూపాల్లేకుండా చేయాలని భావించే వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంను టార్గెట్ చేసుకునే పని చేసిందని అంటున్నారు. అయితే జగన్ సర్కార్ ప్రయత్నాలేవీ ఫలించలేదు. జనంలో సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. స్వయంగా జగనే వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించేశారు. అంటే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇంకా పూర్తిగా ఆరు నెలల సమయం కూడా లేదు. ఆ కారణంగానే జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న తెలుగుదేశం కు అడ్డుకట్ట వేయాలన్న ఏకైక లక్ష్యంతోనే సీఐడీని రంగంలోకి దిగి అసలు పేరు, ఊరు లేని కేసులో తీవ్రమైన ఆర్ధిక నేరాలు చేసిన వారిపై బనాయించే సెక్షన్లను నమోదు చేసి అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేయించారు. దాని పర్యవసానమే ఇలా ఇంటా బయటా జగన్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఇక ఇండియన్ లీగల్ కథనం విషయానికి వస్తే..
స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనంటూ తేల్చేయడమే కాకుండా.. తన కథనానికి బలం చేకూర్చేలా ఈ విషయంపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా ప్రచురించింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య.. న్యాయ వ్యవస్థ రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా పని చేస్తుందని చెబుతూనే కొన్ని విషయాలలో రాజకీయపరంగా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అన్నారు. అయినా రాజకీయ కక్ష సాధింపునకు కేసులు పెట్టడం అన్నది అత్యంత తీవ్రమైన అంశమని అభిప్రాయపడ్డారు. అలాగే ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీజే కోల్ఫే పాటిల్ అయితే మరింత స్పష్టంగా చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని చెప్పేశారు. చంద్రబాబు కనుక బీజేపీతో మైత్రిలో ఉండి ఉంటే ఆయనపై ఈ కేసు ఉండేదే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేసులో పస లేకపోయినా రాజకీయ కక్ష సాధింపుతో కేసులు బనాయించి అరెస్టు చేయాలనుకుంటే దేశంలో ఏ రాజకీయ నాయకుడూ ఖైదును తప్పించుకోలేరన్నారు.