గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసిన లక్నో సూపర్ జెయింట్స్
posted on Apr 8, 2024 @ 11:08AM
ఐపీఎల్2024లో భాగంగా ఆదివారం లక్నో, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ ను 33 పరుగుల ఆధిక్యతతో చిత్తు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
164 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ 18.5 ఓవర్లలో కేవలం 130 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లక్నో జట్టులో మార్కస్ స్టొయినిస్ అర్ధ సెంచరీ చేశాడు. లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్ అద్భుతంగా రాణించి ఐదు వికెట్లు పడగొట్టి గుజరాత్ పతనాన్ని శాశించాడు. లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు శుభారంభం దక్కినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక చతికిలపడింది.
ఓపెనర్లు శుభమాన్ గిల్, సాయి సుదర్శన్ 6 ఓవర్లలో 54 పరుగుల భాగస్వామ్యం సాధించారు. కానీ కృనాల్ పాండ్యా సాయి సుదర్శన్‌ను ఔట్ చేయడంతో వికెట్ల పరంపర మొదలైంది. శుభమన్ గిల్ 19, కేన్ విలియమ్సన్ 1, శరత్ బీఆర్ 2, విజయ్ శంకర్ 17, దర్శన్ నల్కండే 12, రషీద్ ఖాన్ 0 పరుగులకు పెవిలియన్ చేరారు.