నవంబర్ 24 నుంచి లోకేష్ పాదయాత్ర.. జగన్ సర్కార్ పై దండయాత్ర!
posted on Nov 20, 2023 @ 12:53PM
స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టు తో తాల్కాలికంగా నిలిచిపోయిన లోకేష్ పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. అశేష్ జనాదరణతో అప్రతిహాతంగా సాగుతున్న సమయంలో చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసింది. ఆ సమయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలులో జరుగుతున్న యువగళం పాదయాత్రను నారా లోకేశ్ తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు బెయిల్ కోసం, క్వాష్ కోసం ఆయన ఢిల్లీ వేదికగా న్యాయపోరాటంలో నిమగ్నమయ్యారు. అందుకోసం న్యాయవాదులతో వరుస భేటీలు, అలాగే జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడం, జాతీయ మీడియా వేదికగా ఏపీలో జగన్ సర్కార్ అకృత్యాలు, అక్రమాలను ఎండగట్టడం వంటి కార్యక్రమాలలో ఆయన క్షణం తీరిక లేకుండా గడిపారు. చంద్రబాబు నాయుడు 52 రోజుల తర్వాత మధ్యంతర బెయిల్‌పై చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తరువాత కూడా చంద్రబాబు ఆరోగ్యం, వైద్య పరీక్షలు, కంటికి శస్త్రచికిత్స వంటి విషయాలలో లోకేష్ తండ్రికి చేదోడువాదోడుగా, అండగా ఉన్నారు. ఇక ఇప్పుడు వచ్చే శుక్రవారం(నవంబర్ 24) నుంచి యువగళం పాదయాత్రను పున: ప్రారంభించాలని నిర్ణయించారు.
చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసిన సెప్టెంబర్ 9న ఎక్కడైతే తాను తన పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారో అక్కడి నుంచే తిరిగి ప్రారంభించేందుకు లోకేష్ నిర్ణయంచుకున్నారు. అందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
మరోవైపు నారా లోకేశ్‌ను టార్గెట్ చేస్తూ.. యువగళం పాదయాత్రను నిలిపివేశారని.. అలాగే తెలంగాణలో ఎన్నికలో పోటీ నుంచి తెలుగుదేశం వైదొలిగిందనీ వైసీపీ కీలక నేతలు విమర్శలతో నోటికి పని చెప్పారు. అదీకాక ఓ వైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. ఇంకో వైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సైతం మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వేళ... అసెంబ్లీ ఎన్నికలకు అట్టే సమయం లేదని.. దాంతో మళ్లీ పాదయాత్రకు శ్రీకారం చుట్టి.. ప్రజల్లోకి వెళ్లాలని నారా లోకేశ్ నిర్ణయం తీసుకున్నట్లు పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.
2023, జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఆయన పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు, బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ తదితర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి తనదైన శైలిలో వివరిస్తున్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్ట్ అక్రమంగా అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పుడు ఎక్కడైతే తన పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారో.. అక్కడ నుంచే లోకేష్ మళ్లీ యువగళం పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇప్పుడు లోకేష్ కూడా యువగళం పేరిట దండయాత్ర మొదలు పెడితే వైసీపీకి ఫైనల్ డేంజర్ బెల్ మోగినట్లేనని రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. ఇప్పుడు లోకేష్ యువగళం పాదయాత్ర జగన్ సర్కార్ పాలిట దండయాత్రగా మారడం తథ్యమని తెలుగుదేశం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.