హద్దుల్లేని అహంకారానికి నిలువెత్తు నిదర్శనం!
posted on Nov 20, 2023 @ 12:16PM
ఒక జట్టుగా ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచంలో తిరుగులేనిది అయి ఉండొచ్చు. జట్టులో ఆటగాళ్లంతా సమష్టిగా విజయం కోసం సర్వశక్తులూ ధారపోసి ఉండోచ్చు. నైపుణ్యం కలిగిన జట్టుగా ఆసీస్ జట్టను అంతా గౌరవిస్తారు. అయితే ఆటగాళ్ల అహంభావాన్ని, అహంకారాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపుతూనే ఉంటారు. క్రీడా స్ఫూర్తి అన్న పదానికి ఆసీస్ జట్టు మినహాయింపు అనే అంతా అంటారు. ఆసీస్ తో ఆడిప ప్రతి జట్టూ ఈ విషయాన్ని ఎలాంటి దాపరికాలూ, బేషజాలూ, మోహమాటాలూ లేకుండా అంగీకరించేస్తుంది.
విజయం దూరమౌతోందంటే.. ఆ జట్టులో ఏ మాత్రం క్రీడా స్ఫూర్తి కనిపించదు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా బలమైన జట్టుతో తలపడుతున్నామని భావిస్తే చాలు ముందు ప్రత్యర్థి జట్టును సైకిలాజికల్ గా దెబ్బతీసే వ్యూహంతో నోటికి పని చెబుతారు. జట్టు మానసిక స్థైరం దెబ్బతీయడమే లక్ష్యంగా మీడియా సమావేశాలలో మాట్లాడతారు. స్లెడ్జింగ్ కు పాల్పడతారు. మ్యాచ్ కు ముందు హీట్ పెంచేసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టేస్తారు. మైదానం బయట ఆసీస్ జట్టు సభ్యులు చేసే ఇవేవీ ఆటలో భాగం కాదు. కానీ ప్రత్యర్థుల ఏకాగ్రతను దెబ్బ తీసే విధానాలు అనడంలో సందేహం లేదు. ఇక మైదానంలో కూడా ఆసీస్ ఆటగాళ్ల నిబద్ధత, నిజాయితీ ఎప్పుడూ ప్రశ్నార్ధకంగానే ఉంటుంది.
స్కిప్పర్ గా బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడినందుకు స్టీవెన్ స్మిత్, అతడికి సహకరించినందుకు డేవిడ్ వార్నర్ లపై వేటుపడిన సంగతి తెలిసిందే. అలాగే రివ్యూ కోరుకోవడమనేది పూర్తిగా మైదానంలో ఉన్న జట్టుకు సంబంధించిన విషయం. అందులో మైదానం బయట ఉండే హెల్ప్ స్టాఫ్ కు ఏ పాత్రా ఉండదు. కానీ స్మిత్ ఆ రివ్యూ తీసుకోవాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవడం కోసం కోసం పదే పదే డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడటం, అక్కడ నుంచి సైగల ద్వారా సంకేతాలు అందడం తెలిసిందే. అప్పట్లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. ఆ రెండు సందర్భాలూ కూడా ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పటివే. ఆటలో నైపుణ్యం విషయంలో ఆసీస్ క్రీడాకారులను ఎవరూ వంక పెట్టరు కానీ, క్రీడాస్ఫూర్తి, వ్యవహారశైలి విషయంలో ఆ ఆటగాళ్లకు ఎవరూ కనీసం పాస్ మార్కులు కూడా వేయరు.
ఇక ఒక టోర్నమెంట్ కానీ, మ్యాచ్ కానీ గెలిచిన తరువాత ఆ జట్టు ఎంత అహంభావంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో ఒకటి చెప్పుకోవాలంటే.. 2006లో ఆస్ట్రేలియా జట్టు చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. అప్పట్లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శరద్ పవార్ జట్టు సారథికి ట్రోఫీ అందించారు. శరద్ పవార్ బీసీసీఐ అధ్యక్షుడే కాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, కేంద్ర మంత్రిగా కూడా కీలక బాధ్యతలు వహించారు. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు కూడా. అటువంటి సీనియర్ పొలిటీషిన్ ను కప్పు అందుకోగానే వేదిక మీదనే పక్కకు నెట్టేసి ఆసీస్ జట్టు సంబరాలు చేసుకున్న తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ విమర్శలను పట్టించుకోవడం కానీ, పొరపాటు జరిగిందని క్షమాపణలు చెప్పడం కానీ ఆసీస్ ప్లేయర్లకు అలవాటే లేదు.
తాజాగా 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ప్రైజ్ డిస్ట్రీబ్యూషన్ అయిపోయిన తరువాత డ్రెస్సింగ్ రూంలో ఆసీస్ ఆటగాడు మిచెల్ మార్ష్ అంతకు ముందే గెలుచుకున్న వరల్డ్ కప్ పై దర్జాగా కాళ్లు పెట్టి కూర్చుని బీరు తాగుతున్న ఫొటో వివాదాస్పదంగా మారింది. సామాజిక మాధ్యమంలో అందుకు సంబంధించి ఫొటో వైరల్ అయ్యింది. నెటిజన్లు మార్ష్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు, లెజెండ్ లు కూడా మిచెల్ మార్ష్ తీరును తప్పుపడుతున్నారు. మార్ష్ తీరు క్రికెట్ కే అవమానమని అంటున్నారు. ఎవరేమనుకుంటే మాకేం అన్నట్లుగా ఆసీస్ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి క్రికెట్ ఆస్ట్రేలియా ఎలా స్పందిస్తుందో చూడాలి.