మందు ప్రియులకు శుభవార్త
posted on May 6, 2023 @ 11:20AM
భారత్ లో ఆర్థికంగా పురోగతి చెందుతున్న రాష్ట్రాలలో మహరాష్ట్ర ముందంజలో ఉంది. తెలంగాణాను కూడా ఆర్థిక పురోగతి చెందిన రాష్ట్రాల సరసన చేర్చడానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించినట్లు తెలుస్తోంది. మద్యం రేట్లను బీఆర్ ఎస్ ప్రభుత్వం తగ్గించింది. ఈ తగ్గించిన కారణంగా 10 శాతం ఆర్థిక పురోగతి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఒక వేళ పురోగతి నమోదుకాకపోతే అక్కడి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాష్ట్ర సర్కారు హెచ్చరించింది. ఈ నెల నాలుగో తేదీ తర్వాత ఉత్పత్తి అయ్యే మద్యం అమ్మకాలకే ఈ ధరలు వర్తిస్తాయి.
తెలంగాణలో మద్యం ధరలను ప్రభుత్వం తగ్గించింది. మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో బీర్ మినహా లిక్కర్ కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు తగ్గాయి.
ఫుల్ బాటిల్ పై రూ.40 హాఫ్ బాటిల్ పై రూ.20 క్వార్టర్ బాటిల్ పై రూ.10 చొప్పున ధరలు తగ్గాయి. కొన్ని రకాల బ్రాండ్స్ ఫుల్ బాటిల్స్ పై రూ.60 వరకూ తగ్గించినట్లు రాష్ట్ర అబ్కారీ అధికారులు తెలిపారు. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
మద్యం అధిక ధరలు కారణంగా బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి లిక్కర్ అక్రమంగా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ మద్యం రవాణాను నియంత్రించేందుకు ప్రభుత్వం లిక్కర్ ధరలు తగ్గించినట్టు అబ్కారీ అధికారులు స్పష్టం చేశారు.ఈ మేరకు లిక్కర్ తయారీ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చినట్లు వారు వెల్లడించారు. ఈ తగ్గించిన ధరలు కొత్తగా కొనుగోలు చేసిన మద్యం బాటిళ్లపై వర్తిస్తాయని తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గజ్జెల నాగేశ్ వెల్లడించారు.
పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ధరలను తగ్గించామని చెబుతున్నా.. త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యమే దీనికి కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి.