ఆకాశంలో మెరుపుల రైలు!
posted on Sep 13, 2022 @ 6:09PM
తారలు దిగివచ్చిన వేళ.. అంటూ పాత సినిమాల్లో హీరో పాడుకుంటూ తోటలో తిరుగుతూంటాడు.. చంద మామా రావే.. అంటూ తల్లి పిల్లడి కోసం పిలుస్తూంటుంది.. తారలు దిగివస్తారో రారో, చందమామ పిల్లడి కోసం వస్తాడో రాడో కానీ, లక్నోలో ప్రజలు హఠాత్తుగా ఆకాశంలో చాలామంది దివిటీలు పట్టుకుని అలా సంచరిస్తున్నట్టు.. వెలుగు రైలుని చూసి ఆశ్చర్య పోయారు!
ఆకాశం ఎప్పుడూ వింతల కేంద్రమే. వింత వింత ఆకారాల మబ్బులు, మెరుపుల వెలుగురేఖలు.. ఎంత ఆకట్టుకుంటాయో అంతగా భయపెడతాయి కూడా! ఎండాకాలం వెండిమేఘాలు, వర్షాకాలం వాన మబ్బు లు ఎప్పుడూ చిత్ర విచిత్రాలనే చూపుతుంటాయి. ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక సమయం లో ఆకాశంలో ఏదో అద్భుతం జరగుతూనే ఉంటుంది. అంతరిక్షం ఎప్పుడూ మిస్టరీయే అంటారు శాస్త్ర వేత్తలు.
ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు యు ఎఫ్ ఓలు వస్తూ పోతున్నాయంటున్నారు. వేరే గ్రహం నుంచి ఎవరో వస్తూ పోతున్నారన్న వాదనా వినపడుతోంది. కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కానీ వాటిని ఎంత వరకూ నమ్మాలన్నదే ఇంకా ఇదమిద్ధం తేల లేదు. ఈమధ్యనే ఉత్తరప్రదేశ్ లక్నోలో ప్రజలు హఠాత్తుగా ఆకాశం లో ఏదో రైలు వెళుతూన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
ఆకాశంలో వెలుగు చుక్కలు అలా పెద్ద రైలు వెళ్లినట్టు వెళ్లడం స్థానికులు చూశారు. అదేదో పిల్లల ఆటలో రైలు వెళుతోన్నట్టు సాగిపోవడం చూసి పిల్లలూ కేరింతలు కొట్టారు. చూడ్డానికి ఎంతో బావుంద న్నారు అం తా. ఇటువంటివి ఎన్నడూ గమనించలేదన్నారు.
అయితే అదేమీ భయపడాల్సినది కాదని, అది స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ అయి ఉంటుందని శాస్త్రవేత్తలు అన్నారు. అంతే తప్ప అదేమి వేరే గ్రహాలనుంచీ దివిటీలు పట్టుకుని ఎవ్వరూ కిందకి దిగడం లేదని, అలా భావించి భయపడనవసరం లేదని అన్నారు. చాలామంది ఆ వెలుగుల రైలును కెమెరాల్లో, ఫోన్‌ల లో బంధించారు. కాగా, చాలామంది ఛాందసులు ఇది దైవమహత్యం అని అంటున్నారు. చాలామంది ట్విటర్ వినియోగదారులు రకరకాల అభిప్రాయాలను పోస్టు చేస్తున్నారు. కొందరు నాసా సంబంధించిం దని, మరికొందరు ఇస్రో స్పేస్ ఎక్స్ సంబంధించినదని కామెంట్లు పెట్టారు. ఏది ఏమయినప్పటికీ, పెద్దగా భయపడాల్సిన అవసరంలేదని అంటున్నారు. ఆకాశంలో కనపడుతున్న అనేక విచిత్రాల్లో ఇదొకటిగా భావించాలి.