వచ్చే మార్చి లోపు ముఖ్యమంత్రిగా కేటీఆర్!
posted on Dec 24, 2020 @ 11:14AM
తెలంగాణలో కీలక మార్పులు జరగబోతున్నాయని తెలుస్తోంది. వరుస విజయాలతో బీజేపీ దూకుడు, టీపీపీసీకి కొత్త బాస్ వంటి పరిణామాలతో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతుండగా.. రాజకీయాలతో పాటు ప్రభుత్వ పాలనలోనూ సమూల మార్పులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. వచ్చే మార్చి లోపే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఉండబోతున్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలోనే ఈ చర్చ కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. వచ్చే మార్చిలోపు కేటీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉందని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ తాజాగా చెప్పడం ఇందుకు బలాన్ని ఇస్తోంది. డోర్నకల్‌లో మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన రెండు ట్రాక్టర్లను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సీనియర్ ఎమ్మెల్యే.. ఈ మధ్య తాను మంత్రి కేటీఆర్‌ని కలిసి కురవి మండలం సీరోలు గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని, నర్సింహులపేటలో పీహెచ్‌సీ నెలకొల్పాలని కోరినట్లు చెప్పారు. అలాగే డోర్నకల్‌కు ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరు చేయాలంటూ విన్నవించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కాబోయే సీఎం కేటీఆర్ అంటూ రెడ్యానాయక్ వ్యాఖ్యానించారు.
సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వ్యాఖ్యలతో కేటీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెబుతున్నారు. చాలా కాలంగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ రెండో సారి అధికారంలో వచ్చినప్పుడే కేటీఆర్ సీఎం అవుతారని భావించారు. కాని కేసీఆరే మరోసారి బాధ్యతలు చెపట్టారు. లోక్ సభ ఎన్నికలకు ముందు తాను జాతీయ స్థాయి రాజకీయాలకు వెళతానని, ఫెడరల్ ఫ్రంట్ పెడతానని కేసీఆర్ ప్రకటించారు. దీంతో కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి కేసీఆర్ ఢిల్లీకి వెళతారని భావించారు. కాని లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మారిపోయింది. ఈ ఏడాది మొదట్లో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దీంతో అప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. కాని అది జరగలేదు. తర్వాత తెలంగాణ ఫార్మేషన్ డే అయిన జూన్ 2న.. తెలంగాణ సీఎంగా కేటీఆర్ బాధ్యతలు తీసుకోవచ్చనే మరో ప్రచారం జరిగింది. అయితే కరోనా మహమ్మారి రావడంతో.. అందరూ దానిపైనే దృష్టి సారించారు. దీంతో జూన్ ముహుర్తం కూడా దాటి పోయింది.
గ్రేటర్ ఎన్నికల సమయంలో మళ్లీ కేటీఆర్ ముఖ్యమంత్రి అంశం తెరపైకి వచ్చింది. 2016 తరహాలోనే గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ కారు పార్టీకి బంపర్ విజయాన్ని అందించి.. తర్వాత ముఖ్యమంత్రి సీటును కేటీఆర్ తీసుకుంటారని కొందరు అభిప్రాయపడ్డారు. అదే జరుగుతుందని అంతా అనుకున్నారు. కాని ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో కేటీఆర్ సీఎం అంశం మరుగునపడింది. అయితే తాజాగా సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రకటనతో.. టీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలతో ఈ విషయంపై కేసీఆర్ చర్చించారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి మార్పుతో పాటు మంత్రివర్గంలో సమూల మార్పుల దిశగా కేసీఆర్ కసరత్తు చేశారని చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. అయితే బీజేపీ పెద్దలతోనూ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే అంశంపై కేసీఆర్ మాట్లాడి ఉండవచ్చని చెబుతున్నారు.