దేశంలో 2022లో జమిలి ఎన్నిక ? రాష్ట్రాలు చుట్టేస్తున్న సీఈసీ అరోరా !
posted on Dec 24, 2020 @ 10:33AM
దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా? మోడీ సర్కార్ అనుకుంటున్నట్లే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగబోతోందా ? అసలు జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? ఈ అంశాలపైనే గత ఏడాది కాలంగా దేశంలో చర్చ జరుగుతోంది. జమిలి ఎన్నికలు రాబోతున్నాయని కొందరు .. మన దేశంలో అలా నిర్వహించడం సాధ్యం కాదని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు చూస్తుంటే దేశంలో 2022లోనే జమిలి ఎన్నికలు రావడం ఖాయమని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. గురువారం ఆయన హైదరాబాద్ కూడా వస్తున్నారు. దేశంలో ఏక కాలంలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల కసరత్తులో భాగంగానే సీఈవో రాష్ట్రాలు తిరుగుతున్నారనే చర్చ జరుగుతోంది.
జమిలి ఎన్నికల గురించి జాతీయస్థాయిలో సీరియస్ చర్చే జరుగుతోంది. కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ జమిలి ఎన్నికల పాట పాడుతోంది. పార్లమెంటుకూ, అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు. లోకసభకు, శాసనసభలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని 1982లో ఎన్నికల కమిషన్ ప్రతిపాదన చేసింది. 1999లో లా కమిషన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రధాన మంత్రి ఈ అంశాన్ని తన ప్రసంగాలలోనూ, మన్ కీ బాత్ లాంటి కార్యక్రమాల్లోనూ ప్రస్తావిస్తూ వస్తున్నారు. జమిలి ఎన్నికల మీద కేంద్ర ఎన్నికల సంఘం, లా కమిషన్ ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఏయే పార్టీలు అనుకూలంగా ఉన్నాయో నిర్ణయానికి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏక కాలంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. జమిలి ఎన్నికల నిర్వహణకు కసరత్తు కూడా మొదలు పెట్టింది. దేశంలో జరిగే అన్ని ఎన్నికలకూ ఒకే ఒక ఓటరు జాబితా ఉండే విధంగా దృష్టి పెట్టింది. ఇన్నేళ్లూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ తయారు చేసిన జాబితా, మునిసిపల్, కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు లు సిద్ధం చేసిన జాబితాలను విడివిడిగా వాడుతున్నారు.
జమిలి ఎన్నికలే నిర్వహించాల్సి వస్తే వివిధ రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని ఎలా ఖరారు చేయాలనేదాని మీద సందేహాలున్నాయి. కొన్నిచోట్ల మధ్యంతరంగా అసెంబ్లీని ముగించాల్సి వస్తుంది. మరికొన్నిచోట్ల గడువును పొడిగించాల్సి ఉంటుంది. ఇలాంటి లీగల్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగంలో ఎలాంటి సవరణ చేయాలన్నదానిపై కూడా కసరత్తు జరిగింది. నీతి ఆయోగ్ అనేక కోణాల నుంచి ఆలోచించి నివేదికను రూపొందించింది. లా కమిషన్, ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేశాయి. రాజ్యాంగం నుంచి వచ్చే చిక్కులపై ఆటార్నీ జనరల్ నుంచి అభిప్రాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 2022 ఫిబ్రవరి- మార్చి నెలల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ ఎన్నికలు జరుగునున్నాయి. 2022 అక్టోబర్, డిసెంబర్ నెలల్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. 2022 ,2023, 2024లో జరగాల్సిన ఎన్నికలను కూడా అవసరమైనంత కాలం వాయిదా వేయడమో, ముందుకు జరపడమో చేసి దేశ వ్యాప్తంగా లోక్ సభ, అన్ని అసెంబ్లీలు, స్థానిక ఎన్నికలను ఒకేసారి జరిపించాలన్నది మోడీ సర్కార్ వ్యూహం.
ఎన్డీఏ పక్షాలన్ని ఇప్పటికే జమిలి ఎన్నికలకు జై కొట్టగా.. యూపీఏ పక్షాల్లో కొన్ని వ్యతిరేకించగా.. మరికొన్ని ఏ నిర్ణయం చెప్పలేదు. 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడుకు సంబంధించి కేంద్రం నుంచి క్లారిటీ రావడం లేదు. అందుకే టీఎంసీ, డీఎంకే పార్టీలు జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, టీడీపీ, టీఆర్ఎస్ లు జమిలి ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరు నెలల నుంచే జమిలి ఎన్నికల గురించి చెబుతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కొద్ది రోజుల క్రితం జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 2022 చివరలో జమిలి ఎన్నికలకు బీజేపీ ప్రతిపాదిస్తోంది. దాని వల్ల కేసీయార్ అయితే ఏడాది పాటు అధికారం కోల్పోతారు. ఏపీలో ఏడాదిన్నర ముందే అధికారాన్ని వైసీపీ పోగొట్టుకోవాల్సివస్తుంది. అందుకే వైసీపీ జమిలి ఎన్నికలపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదని భావిస్తున్నారు.
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాల అభిప్రాయాలూ తీసుకోవాలి. జమిలి ఎన్నికలకు వెళ్లాలంటే దేశంలోని రెండొంతుల రాష్ట్రాలు అందుకు అంగీకరించాలి. పార్లమెంటులో చర్చ జరగాలి. అక్కడా మూడులో రెండొంతుల అంగీకారం రావాలి. ఆ తర్వాత రాష్ట్రపతి అంగీకరించాలి. ఇక్కడ బీజేపీ తలచుకుంటే ఇవేమి అసాధ్యం కాదు. ప్రస్తుతం దేశంలో 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. మరో నాలుగు రాష్ట్రాల్లో అంగీకరిస్తే మొదటిదశ పూర్తయినట్టే. మిత్రపక్షాల మద్దతుతో అది కూడా పెద్ద సమస్య కాదు. అందుకు బీజేపీ దగ్గర వ్యవస్థలున్నాయి. పార్లమెంటులో చర్చించి వాటిని దారికి తీసుకురావడం పెద్ద సమస్య కాబోదు. అందుకే 2022లో దేశంలో కచ్చితంగా జమిలి ఎన్నికలు జరగడం ఖాయమనే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు సీఈవో రాష్ట్రాల పర్యటనకు ప్రాధాన్యత ఏమి లేదంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు రొటిన్ విజిట్ లో భాగంగానే ఆయన హైదరాబాద్ వస్తున్నారని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.