రాహుల్ అడుగుజాడల్లో మంత్రి కేటీఆర్?
posted on Oct 8, 2022 @ 11:47PM
అడుసు తొక్కనేల, కాలు కడగనేల అన్నది అందరికి తెలిసిన పాత సామెత. అయితే, రాజకీయాల్లో ఉన్నవారు, ముఖ్యంగా, తెలంగాణ మంత్రి కల్వకుట్ల తారక రామారావు (కేటీఆర్) వంటి యంగ్ పోలిటిషియన్స్ తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానంతో తమ అజ్ఞానాన్ని బయటపెట్టు కుంటారు. నిజానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను తరచు విమర్శించే రాహుల్ గాంధీ నుంచి ఈ విషయంలో కొత్తగా రాహుల్ గాంధీతో పోటీకి దిగుతున్నకేటీఆర్ వరకు చాలా మందికి, ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో తెలియక పోవచ్చును.
అందుకే ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ, బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ అనే భ్రమల్లో బీజేపీతో పాటుగా ఆరఎస్ఎస్ ను అదే గాటన కట్టి అసందర్భ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, మహత్మా గాంధీ హత్య ఆర్ఎస్ఎస్ చేసిందని చేసిన ఆరోపణలకు కోర్టు విచారణను ఎదుర్కున్నారు. చివరకు, ఎన్నికల ప్రచార వేడిలో చేసిన విమర్శగా పేర్కొంటూ కోర్టు క్షమాపణ కోరి బయట పడ్డారు. అయినా ఆయన దోరణి మారలేదనుకోండి అది వేరే విషయం.
అయితే ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీకి దీటుగా జాతీయ నేతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న కేటేఆర్ ఆరఎస్ఎస్ విషయంలో రాహుల్ గాంధీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఆర్ఎస్ఎస్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. నిజానికి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే కాదు, సంఘ్ వ్యవస్థ, కార్య పద్దతులు, విధి విధానాలు, ఇంకా చాలా సంగతులు బయటి వారికి అంత సులభంగా అర్థం కావని అంటారు. అందుకే ఏడుగురు గుడ్డివారు ఏనుగును చేతులతో తడిమి, వారు తాకిన ఏనుగు శరీర అవయావాల ఆధారంగా ఏనుగును, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వర్ణించిన విధంగా ఆర్ఎస్ఎస్ ను విమర్శించే వారి విమర్శలుంటాయని అంటారు.ఇప్పుడు కేటీఆర్ ఆర్ఎస్ఎ అధినేత మోహన్ భగవత్ గురించి చేసిన వ్యాఖ్యలు, విమర్శలు కూడా అదే కోవకు చెందుతాయనిపిస్తోందని, ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్నవారు అంటున్నారు.
అదలా ఉంటటే రాహుల్ గాంధీ చరిత్రను మాత్రమే విస్మరిస్తే, కేటీఆర్ నడుస్తున్న చరిత్రను కూడా విస్మరిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదు. కానీ జాతీయవాద రాజకీయాలను సమర్ధిస్తుంది. ప్రత్యక్ష రాజకీయ కార్యకలాపాలలో ఆర్ఎస్ఎస్ అధినేత కాదు సామాన్య స్వయం సేవకులు (కార్యకర్తలు) కూడా పాల్గొనరు. ఇది ఆర్ఎసఎస్ గురించి కనీస అవగాహన ఉన్న ఎవరికైనా తెలిసిన విషయమే. కానీ, మంత్రి కేటీఆర్ కు మాత్రం ఆ మాత్రం అవగాహన కూడా లేనట్లుంది లేదా జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధితో పోటీ పడాలంటే ఆర్ఎస్ఎస్ గురించి ఆ మాత్రంగా అయినా అసత్యాలు ప్రచారం చేయాలని అనుకున్నారో ఏమో కానీ, అందుకే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఎవరని ప్రశ్నించారు. ఆయన, కౌన్సిలర్
గా కూడా గెలవలేదని గేలి చేశారు, కౌన్సిలర్ గా గెలిచి ఆ తర్వాతనే ఆయన దేశం గురించి మాట్లాడాలని, కేటీఆర్ ఆర్ఎస్ఎస్ అధినేతను దుయ్యబట్టారు.
అయితే నిజంగానే మోహన భగవత ఎవరో తెలియకుండానే కేటీఆర్ ఆయనపై విరుంచు పడ్డారా? ఆయనకున్న శక్తి ఏమిటో తెలియకుండానే కేటీఆర్ ఆయన్ని టార్గెట్ చేశారా? నిజమే మోహన్ భగవత్ కౌన్సిలర్ గా గెలవడం కాదు పోటీకూడా చేయలేదు. ఆయనే కాదు వందేళ్ళు పూర్తి చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్ చరిత్రలో సంఘ అధినేతలు, బాధ్యులు ఎవరూ ఎన్నికలలో పోటీ చేయలేదు.
సంఘ అధినేతలే కాదు, జీవితాలను సంఘ కార్యానికి అంకితం చేసిన వేలాది, లక్షలాది మంది ప్రచారకులు, విభిన్న సామాజిక కార్యక్షేత్రాలలో పనిచేస్తున్న పూర్తి సమయ కార్యకర్తలు ఎవరూ రాజకీయ పదవులను ఆశించలేదు. పోటీ పడలేదు. కానీ, కేవలం రెండు పార్లమెంట్ స్థానాల నుంచి ప్రస్తుత 303 స్థానలకు బీజేపీ చేరిందంటే, ఆ విజయం వెనక ఉన్నది సంఘ్ శక్తి. ఈ విషయం తెలియకుండా ఆర్ఎస్ఎస్ అధినేతని కౌన్సిలర్ గాకూడా గెలవలేదని గేలి చేయడం అయితే అది వారి అజ్ఞానం అవుతుంది. కాదంటే, అమాయకత్వం అనిపించుకుంటుంది. సంఘ్ రాజకీయ పార్టీ కాదు, సంఘ్ శక్తి కేంద్రం. విభిన్న క్షేత్రాలలో వెలుగులు నింపే శక్తి కేంద్రం అంటారు.