గవర్నర్ల వ్యవస్థ అవసరమా?
posted on Apr 12, 2023 @ 12:07PM
బీజేపీయేతర రాష్ట్రాలపై కక్ష సాధించడం కోసమే కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను వాడుకుంటోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని సూచిస్తూ తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొంతం దిలీప్ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్విట్ చేశారు. ఆ ట్విట్‌కు కేటీఆర్ తన వ్యాఖ్యను జోడించారు. తమ అధికారాలను నిర్దాక్షిణ్యంగా దుర్వినియోగం చేస్తున్న దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాల్లోని గవర్నర్లపై తమిళనాడు ప్రభుత్వం ఇటీవల అభ్యంతరం తెలిపింది.
బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ గవర్నర్ కూడా కొన్ని బిల్లులను పెండింగ్‌లో పెట్టారని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారు కేంద్ర ప్రభుత్వ అధీనంలో రాజకీయ పావులుగా మారారని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదని, ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు. సహకార సమాఖ్య పాలనకు ఇది ఒక నమూనా కాదా అని ఆయన నిలదీశారు. టీమ్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర వైఖరి ఉందని, ఇది దేశ ప్రగతికి, సామరస్యానికి ఎలా దోహదపడుతుందని మంత్రి కేటీఆర్‌ప్రశ్నిస్తున్నారు.
గవర్నర్ వ్యవస్థ వ్యర్థ మని ఇప్పటికే పలువురు న్యాయ కోవిదులు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం.. గవర్నర్లను .. తమ ప్రయోజనాల పరిరక్షణకు ఉపయోగించు కుంటోందని ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలో కేటీఆర్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.