వైకాపాలో ‘ముందస్తు’ తొందర!
posted on Apr 12, 2023 @ 12:24PM
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హీట్ రోహిణికార్తె ఎండలను మించిపోయింది. రెండు రాష్ట్రాలలోనూ కూడా ముందస్తు ఎన్నికలు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ముందస్తు ప్రశక్తేలేదని అన్యాపదేశంగానైనా సరే స్పష్టం చేసినా..వాటికి ఫుల్ స్టాప్ పడటంలేదు. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్ కూ ఎన్నికలు అంటూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారానికి ఊతం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులు, వైసీపీ నాయకులూ ముందస్తు ముచ్చటే లేదంటూ సందర్భం కల్పించుకుని మరీ ప్రకటనలు గుప్పిస్తున్నారు.
అయితే పరిశీలకుల విశ్లేషణ మేరకు తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏపీలో మాత్రం ముందస్తుకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఏపీలో వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల కొనసాగింపు ప్రశ్నార్థకంలో పడింది. ఆ పథకాలు కొనసాగించలేక నిలిపేయాల్సిన పరిస్థితి ఎదురైతే.. ప్రభుత్వ ప్రతిష్ట మంటగలుస్తుంది. ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. పథకాలు కొనసాగుతుండగానే ఎన్నికలకు వెళ్లడం మేలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. ఆ పార్టీ ముఖ్య సలహాదారు సజ్జల ఆ విషయాన్ని ఇప్పటికే పలు మార్లు సూచన ప్రాయంగానే అయినా పలు మార్లు మీడియా ముఖంగానే చెప్పారు.
అందుకే రాష్ట్రంలో ఎన్నికల హీట్ ను పెంచేలా సీఎం జగన్ ఎమ్మెల్యేలకు మార్కులు గ్రేడులూ కేటాయిస్తూ పరుగులెత్తించే కార్యక్రమానికి తెరతీశారు. గడపగడపకూ, ఇంటింటికీ స్టిక్కర్లు అంటూ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను పరుగులెత్తిస్తున్నారు. ఇవన్నీ జగన్ ముందస్తు ఆచోనలను ప్రతిబింబిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే ఏపీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుంటే జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంతో పాటే ఏపీలో కూడా ఎన్నికలు జరిగేలా జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని అంటున్నారు.