పండుగ పూట అరాచకమే!
posted on Mar 11, 2021 8:04AM
కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులపై నిన్న దురుసుగా ప్రవర్తించారంటూ రవీంద్రపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసేందుకు ఉదయం 6 గంటలకే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.
కొల్లు రవీంద్ర అరెస్ట్ నేపథ్యంలో ఉదయం నుంచి మచిలీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రవీంద్రను అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులను కార్యకర్తలు, అభిమానులు అడ్డుకున్నారు. రవీంద్రను పోలీసు వాహనం ఎక్కనీయకుండా అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు వారిని పక్కకు తొలగించేందుకు యత్నించగా కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరకు కార్యకర్తలను అడ్డుతొలగించిన పోలీసులు కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై రవీంద్ర వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొల్లు రవీంద్ర ఇంటికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో వైసీపీ పాల్పడిన అక్రమాలను అడ్డుకున్నందునే రవీంద్రను అరెస్టు చేశారని ఆరోపించారు. పండుగ పూట కూడా బీసీలను జగన్ రెడ్డి ప్రభుత్వం సంతోషంగా ఉండనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కొల్లు రవీంద్రను విడుదల చేయాలని బాబు డిమాండ్ చేశారు. గూండాయిజాన్ని ఎదిరించినందుకే బీసీలపై కక్షకట్టారా? అని ప్రశ్నించారు. కొల్లు రవీంద్ర చేసిన నేరమేంటి? అని చంద్రబాబు నిలదీశారు. బూతుల్లోకి వెళ్లి దొంగఓట్లు వేసుకున్న వైసీపీ నేతలపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులకు దిగిన వైసీపీ నాయకులను ఎంతమందిని అరెస్టు చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై దౌర్జన్యాలు, దాడులు, అరెస్టులు పతాక స్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. బీసీల వ్యతిరేకి సీఎం జగన్ అని.... బీసీలు బుద్ధి చెప్పే రోజులు రానున్నాయని చంద్రబాబు హెచ్చరించారు.