ఈ యుగానికి కోహ్లీయే క్రికెట్ కింగ్!
posted on Oct 23, 2022 @ 11:53PM
విరాట్ కోహ్లీ పని అయిపోయింది. ఇక విరాట్ రిటైర్మెంట్ తీసుకోవాలి. విరాట్ సెంచరీ చేయక మూడేళ్లు అవుతుందని ఆసియా కప్ కు ముందు విరాట్ కోహ్లీ విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడిచాయి. కానీ కోహ్లీ వారికి తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. ఆసియా కప్ లో ఫామ్ లోకి వచ్చాడు.
ఆప్ఘానిస్థాన్ పై అద్బుత సెంచరీ చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ పై మ్యాచ్ లో భారత్ ను ఓటమి అంచుల నుంచి గట్టెక్కించి ఒంటి చేత్తో గెలిపించాడు. ఛేజింగ్ లో తనను మించిన మొనగాడు లేడని మరో సారి రుజువు చేశారు. ఆసియా కప్ లో సెంచరీ చేసిన తరువాత కూడా కోహ్లీపై ట్రోలింగ్ కొనసాగింది. పసి కూనపై సెంచరీ చేయడమైతే చేశాడు కానీ.. ఆ తరువాత మళ్లీ కోహ్లీ బ్యాట్ కు పని చెప్పలేదనీ, కోహ్లీ పనైపోయినట్లేనని ట్రోల్ చేశారు.అయితే ఆదివారం (అక్టోబర్ 23) పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాటుడి బ్యాటింగ్ విన్యాసాలు విమర్శకుల నోళ్లు మూయించాయి. ఇప్పటి వరకూ కోహ్లీ ఫామ్ కోల్పోయాడనీ, ఇక అతడిలో క్రికెట్ అయిపోయిందనీ ఇంత కాలం విమర్శిస్తూ వచ్చని వాళ్లే ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కింగ్ కోహ్లీ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఆహా కోహ్లీ..ఓహో కోహ్లీ అంటూ ప్రశంసిస్తున్నారు.
కేవలం స్కోరు చేయడమే కాదు.. కోహ్లీలో క్రికెట్ సెన్స్.. ఫిట్ నెస్, వికెట్ల మధ్య సింగిల్స్, డబుల్స్ పరుగులు తీయడం ఇవన్నీ కూడా జట్టులో ఉత్సాహాన్ని నింపుతాయని చెబుతున్నారు. ఇక పాక్ పై మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ మెరుపులతో క్రికెట్ అభిమానులకు ఒక రోజు ముందే దీపావళి పండుగను తీసుకు వచ్చేశాడంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మాజీ క్రికెటర్లు కింగ్ కోహ్లీ ఈజ్ బ్యక్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమ్‌ఇండియాను కోహ్లీ తన అసమాన బ్యటింగ్ పటిమతో విజయ తీరాలకు చేర్చాడు. కోహ్లీ కెరీర్ లో ఇదే ఉత్తమ కాదు కాదు అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటున్నారు.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అయితే కోహ్లీ బ్యాటింగ్ సూపర్బ్, కోహ్లీ కెరీర్ లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించిన విధానం అద్భుతమనీ, 19వ ఓవర్ల లో రవూఫ్ బౌలింగ్ లో బ్యాక్ ఫుట్ కి వెళ్లి లాంగాన్ మీదుగాద కొట్టిన సిక్సర్ బ్రహ్మాండం అని పేర్కొన్నాడు. ఇక ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) అయితే ‘కింగ్ ఈజ్ బ్యాక్.. టేకే బో కోహ్లీ’ అంటూ ట్వీట్ చేసింది.
ఇక మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే తన జీవితంలో ఇప్పటి వరకూ చూసిన అత్యద్భుత టి20 ఇన్నింగ్ నేటి కోహ్లీ బ్యాటింగే అని ట్వీట్ చేశారు. మన హైదరాబాదీ, వెరీవెరీ స్పెషల్ లక్ష్మణ్ కూడా కోహ్లీని పొగడ్తల్లో ముంచెత్తాడు. టి20 ప్రపంచ కప్ కు కోహ్లీ ఇన్నింగ్స్ సరైన సంరంభం అన్నారు. క్లిష్ట పరిస్థితుల నుంచి ఒంటి చేత్తో మ్యాచ్ ను భారత్ ఖాతాలో వేసిన కోహ్లీ క్లాస్ ఎప్పుడూ శాశ్వతం అని మరోసారి నిర్ద్వంద్వంగా నిరూపించాడని పేర్కొన్నాడు. మరో మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ అయితే పాక్ తో మ్యాచ్ లో కోహ్లీ ఇన్నింగ్స్ ను యుగానికొక్క ఇన్నింగ్స్ అని అభివర్ణించాడు. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్ తదితరులు కోహ్లీని అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితర ప్రముఖులు కూడా పాక్ పై విజయం సాధించిన టీమ్ ఇండియా జట్టును అభినందిస్తూ కోహ్లీపై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు.