బీజేపీకి రాపోలు గుడ్ బై.. తెరాసలో చేరిక
posted on Oct 23, 2022 @ 11:22PM
తెలంగాణలో అధికారం మాదే అని తొడగొట్టి చెబుతున్న బీజేపీకి.. ఆ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నిక ముందు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మునుగోడు విజయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయంపై క్యాడర్ లో మరింత ధీమా పెంచాలన్న ఉద్దేశంతో బీజేపీ కోరి ఆహ్వానించిన ఈ ఉప ఎన్నిక ముంగిట ఆ పార్టీ నుంచి వలసలు చినుకుల్లా ప్రారంభమై తుపానుగా మారాయి.
రెండు రోజుల కిందట మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ లు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో కారెక్కిన సంగతి విదితమే. ఆ వెంటనే రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి గుడ్ బై చెప్పి తెరాస గూటికి చేరారు.
దీంతో బీజేపీకి మునుగోడు ఉప ఎన్నిక ముంగిట వలసలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ వలసలు రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉందని తెరాస శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీకి గుడ్ బై చెప్పి గులాబి కండువా కప్పుకున్న రాపోలు ఆనంద భాస్కర్, చేరికకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ తరువాత కేటీఆర్ సమక్షంలో తెరాస గూటికి చేరి.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చేనేతపై జీఎస్టీ వేయడం దారుణమని రాపోలు ఆనంద భాస్కర్ విమర్శించారు. చేనేత అభివృద్ధికి మంత్రి కేటీఆర్ చేపట్టిన చర్యలను ప్రస్తుతించారు.