Read more!

కోదండరామ్ పై గీతా రెడ్డి ఫైర్

 

 

తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం పైన మంత్రి గీతా రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోదండరాం అగ్రుకుల దురహంకారంతో అలా మాట్లాడారని మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యానించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా తనకు ఎలాంటి నష్టం లేదని, కోదండరంకే మచ్చ అన్నారు. ఆయన మాటల తీరును చూసి అందరూ అసహ్యించుకుంటున్నారన్నారు.


పవిత్రమైన ప్రొఫెసర్ వృత్తిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. తన గురించి తన తల్లి గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. ఆయనది ఫ్యూడలిస్ట్ మెంటాలిటీ అని, పెత్తందారీ వ్యవస్థ కోసమే ఆయన పని చేస్తున్నట్లుగా ఉందన్నారు. తెలంగాణవాదులు ఎవరూ తనను వ్యతిరేకించడం లేదన్నారు.



అందర్నీ రాజీనామాలు అడగడం కాదు, ముందు ఆయన తన ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలి అని ధ్వజమెత్తారు. కోదండరాం చేసిన తప్పు క్షమాపణలతో పోయేది కాదన్నారు. తన తల్లి తెలంగాణ కోసం జైలుకు వెళ్లారని, లాఠీ దెబ్బలు తిన్నారన్నారు. ఆమె తెలంగాణ కోసం రాష్ట్రం కోసం ఎంతగానో చేశారన్నారు.



నేను ఒక అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు పరిమితులు ఉంటాయి. అన్ని పరిమితులున్నా నేరుగా అధిష్టానం మీద ఒత్తిడి తేవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశాం. మా వాదన, మా స్వరం సోనియా గాంధీకి, కేంద్ర ప్రభుత్వానికి వినిపించాం అని ఆమె స్పష్టంచేశారు. మెదక్ జిల్లాలోని జహీరాబాద్ పోలీసు స్టేషన్‌లో కోదండరామ్ పై కేసు నమోదైంది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.