మేము గెలిస్తే.. మా వాళ్ళు మిమ్మల్ని బతకనివ్వరు: మజ్లీస్ అభ్యర్థి సంచలన కామెంట్స్
posted on Nov 27, 2020 @ 1:00PM
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో పొలిటికల్ పార్టీలు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓల్డ్ సిటీ పై సర్జికల్ స్ట్రైక్స్ అలాగే ప్రముఖ దివంగత నేతల ఘాట్ లు కూల్చివేయాలనే వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా విన్నాము. తాజాగా కిషన్ బాగ్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థి హుస్సేనీ పాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను తీవ్రంగా హెచ్చరిస్తూ... మిమ్మల్ని గల్లీల్లో తిరగనివ్వమంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. కిషన్ బాగ్ డివిజన్‌లో గురువారం రాత్రి ప్రచారం చేసిన ఆయన.. తాము గెలిస్తే పాతబస్తీ గల్లీలలో ప్రత్యర్థులను తిరగనివ్వమని తీవ్రంగా హెచ్చరించారు. ఎంఐఎం కార్యకర్తలు మిమ్మల్ని బతుకనివ్వరని, అంతేకాకుండా దశాబ్దాలుగా ఇక్కడే స్థిరపడి ఉన్నా.. మీరు ఇక్కడి నుండి వెళ్లిపోక తప్పదని, పరిణామాలు చాల తీవ్రంగా ఉంటాయని ఓటర్లలో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేశారు.
ఇది ఇలా ఉండగా బహదూర్ పూరా ఎంఐఎం ఎమ్మెల్యే మౌజం ఖాన్ తాము వాటర్, కరెంట్ బిల్లులు కట్టేది లేదని జిహెచ్ఎంసికి సవాల్ విసిరారు. అసలు తమను బిల్లులు అడిగే ధైర్యం ఎవరికీ లేదని అయన సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ఎంఐఎం కు ఓటేస్తే ప్రజలు బిల్లులు కట్టాల్సిన పని లేదని అయన పేర్కొన్నారు. ఇప్పటికే ఓల్డ్ సిటీలో కరెంట్, నీటిని బిల్లులు కట్టకుండా వాడుకుంటున్నారని బీజేపీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు ఎంఐఎం ఎమ్మెల్యే మౌజం ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.