ఎమ్మెల్యేలు, అభ్యర్థులకు మధ్య గ్యాప్! గులాబీ పెద్దల్లో టెన్షన్
posted on Nov 27, 2020 @ 1:32PM
ఎమ్మెల్యేకు అభ్యర్థికి మధ్య వార్. ఎమ్మెల్యేకు ఇంచార్జ్ తో విభేదాలు. ఇంచార్జులను పట్టించుకోని క్యాండిడేట్లు.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ లోని పరిస్థితి ఇది. రెండో సారి అధికారం ఖాయమని చెబుతున్న టీఆర్ఎస్ లో క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న సీన్లు ఇవి. గ్రేటర్ లో సెంచరీ కొడతామని మంత్రి కేటీఆర్ చెబుతుంటే.. అందులో సగం కూడా వస్తాయో రావేమోనన్న ఆందోళన గులాబీ నేతల్లో ఉందని చెబుతున్నారు. ప్రచారం అనుకున్నంత దూకుడుగా లేకపోవడం, అభ్యర్థులపై వ్యతిరేకత, లోకల్ ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తి.. ఇలా చాలా కారణాలు గులాబీ నేతల భయానికి కారణమని చెబుతున్నారు.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 డివిజన్లు గెలిచింది టీఆర్ఎస్. అందులో 75 మందికి తిరిగి టికెట్లు ఇచ్చింది. ఇదే ఇప్పుడు అధికార పార్టీగా సమస్యగా మారింది. గతంలో చాలా మంది కార్పొరేటర్లు లోకల్ ఎమ్మెల్యేలతో విభేదించారు. కొన్ని డివిజన్లలో నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయి వరకు ఈ గొడవలు వెళ్లాయి. తమకు నచ్చని వారికి ఈసారి టికెట్లు రాకుండా కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అయితే పార్టీ మాత్రం చాాలా వరకు సిట్టింగులకే అవకాశం ఇచ్చింది. దీంతో గతంలో తమతో విభేదించిన అభ్యర్థుల డివిజన్లను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తన అనుకున్న వారి విజయానికి కృషి చేస్తూ.. ఇతర డివిజన్ల వైపు ఎమ్మెల్యేలు చూడటం లేదని చెబుతున్నారు. కొన్ని డివిజన్లలో తమకు నచ్చని వారిని ఓడించేందుకు కూడా కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. పార్టీ అభ్యర్థులను విసుక్కోవడం, ఖర్చు చేయడం లేదంటూ తరచూ ఆగ్రహం వ్యక్తం చేయడం వంటివి చేస్తూ ఎమ్మెల్యేలు తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.ఎల్బీనగర్, ఖైరతాబాద్, మల్కాజ్ గిరి , ఉప్పల్ నియోజకవర్గాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
కొన్ని ప్రాంతాల్లో డివిజన్ ఇన్‌చార్జులకు లోకల్ ఎమ్మెల్యేలు సహకరించడం లేదట. బూత్ ఏజెంట్ల విషయంలోనూ పేచీలు పెడుతున్నారని తెలుస్తోంది. కొన్ని డివిజన్లలో అభ్యర్థులు కూడా పార్టీ నియమించిన ఇంచార్జులను బేఖాతరు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇంచార్జులతో సంబంధం లేకుండానే ప్రచారాలు చేసుకుంటున్నారట. కొందరు అభ్యర్థులు పార్టీలోని అందరు నేతలను కలుపుకొని పోవడం లేదని చెబుతున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల తీరుతో ఇన్‌చార్జులు విస్తుపోతున్నారట. సహాయ నిరాకరణతో ఏమీ చేయలేని పరిస్థితి ఉండటంతో సైలెంటుగా ఉండిపోతున్నారట.తమకు అప్పగించిన డివిజన్లలో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు హైకమాండ్ కు నివేదిస్తున్నారట ఇంచార్జులు.
ఇంచార్జులు ఇస్తున్న నివేదికలతో అధినాయకత్వం అప్రమత్తమైనట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందనే సందేహంతో నిఘా వర్గాల ద్వారా తెప్పించుకున్న అంశా లు షాకింగ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, అభ్యర్థుల మధ్య పెరిగిన దూరం పార్టీకి చేటుగా ఇబ్బందిగా మారిందని, 20 నుంచి 25 సీట్ల ఫలితంపై ప్రభావం చూపుతుందని నివేదికలో వచ్చినట్లు సమాచారం. దీనిపై అధికార పక్షం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. టికెట్లు ఇచ్చే సమయంలోనే పరస్పరం సహకరించుకోవాలని చెప్పిన తర్వాత కూడా ఇలా చేయడం ఏమిటంటూ సంబంధిత ఎమ్మెల్యేలపై ముఖ్య నేత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సొంత పంచాయితీలను పార్టీ మీద రుద్దటం ఏమిటంటూ గుస్సా అయినట్లు సమాచారం. తీరు మార్చుకోవాలని, ఫలితంలో తేడా వస్తే బాధ్యత వహించాల్సిందేనని హెచ్చరించినట్లు సమాచారం.
అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార పార్టీ ముందు నుంచే ఆచితూచి వ్యవహరించింది. లోకల్ ఎమ్మెల్యేల ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతోపాటు.. స్థానిక అంశాలపై నాలుగైదు నివేదికలు తెప్పించుకొని మరీ అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. ఎమ్మెల్యేలకు, వారి పరిధిలోని అభ్యర్థులకు విభేదాలు ఉంటే సంబంధిత నేతలు ముందే కౌన్సెలింగ్ చేశారు. పార్టీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. అన్నింటికీ ఓకే చెప్పిన వారు.. తీరా ఎన్నికల వేళలో అనుసరిస్తున్న వైఖరి పార్టీ అధినాయకత్వానికి మింగుడు పడడం లేదని తెలుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చనే ఆందోళన గులాబీ పెద్దల్లో ఉందని చెబుతున్నారు.