ఈ నాన్చుడేందిరో!
posted on Nov 26, 2013 @ 5:06PM
సమైక్య సింహంగా తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి నానా తంటాలూ పడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలో తన సొంత పార్టీని ప్రకటించబోతున్నారన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తాను నూటికి నూరుశాతం కాంగ్రెస్ వాదినే అని చెబుతున్న కిరణ్ చాపకింద నీరులా తన కొత్త పార్టీ ప్రయత్నాలను చేస్తున్నట్టు తెలుస్తోంది. తాను పార్టీ ప్రకటించే నాటికి సీమాంధ్రులను పూర్తిగా తనవైపు తిప్పుకునే కిరణ్ ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో తానెంత గొప్పపాలకుడో తానే చెప్పుకోవడంతోపాటు సమైక్య నినాదాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రతి సమావేశంలోనూ ‘‘సమయం వచ్చినప్పుడు నాకు మీ మద్దతు కావాలి’’ అని ప్రజల్ని బతిమాలుకుంటున్నారు. ‘మద్దతు’ అంటే ఇంకేంటి తాను పెట్టబోయే కొత్త పార్టీకి ఓట్లు వేయమనే అర్థమని ప్రజలు నవ్వుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పాడె ఎక్కి చాలాకాలం కావడంతో ఆ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది పార్టీ మారే ఆలోచనలో వున్నారు. సమైక్య సింహాన్నని చెప్పుకుంటున్న కిరణ్ తాను పెట్టబోయే పార్టీ ఏదో త్వరగా పెట్టేస్తే అందులో దూకేద్దామన్న ఐడియాతో వున్నారు.
అయితే కిరణ్ పార్టీ పెట్టే విషయంలో స్పష్టత ఇవ్వకుండా ఇష్యూను నానుస్తూ వుంచడం పట్ల జంప్ జిలానీల్లా మారడానికి సిద్ధంగా వున్న కాంగ్రెస్ నాయకులు చిరాకుపడుతున్నారు. సమయం వచ్చినప్పుడు మీ మద్దతు కావాలని కిరణ్ ప్రజలను అడుగుతున్నారు. అయితే కిరణ్ కొత్త పార్టీ పెట్టడానికి సమయం ఎప్పుడో వచ్చిందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ కిరణ్‌కి పార్టీ పెట్టే ఉద్దేశం లేకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా చెబితే తమదారి తాము చూసుకునే ఉద్దేశంలో వారున్నారు.
కిరణ్ ఇప్పటికైనా ఈ నాన్చుడు ధోరణిని వదిలిపెట్టాలని భావిస్తున్నారు. ఒకవేళ కిరణ్ పార్టీ పెట్టకుండా కాంగ్రెస్‌లోనే ఉండాలని నిర్ణయించుకుంటే తమదారి తాము చూసుకునే ఉద్దేశంలో ఉన్నారు. ప్రస్తుతం సీమాంధ్రలోని కీలకమైన కాంగ్రెస్ నాయకులందరూ తెలుగుదేశం వైపు చూస్తున్నారు. కిరణ్ అటో ఇటో తెలిస్తే వాళ్ళందరూ ఇటో అటో దూకేయడానికి రెడీగా వున్నారు. ఇప్పుడు బంతి కిరణ్ కుమార్ రెడ్డి కోర్టులో వుంది.