హైదరాబాద్ పై శీలంగారి బేరాలు
posted on Nov 26, 2013 @ 6:54PM
రాష్ట్ర విభజనపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలది ఎవరి దారి వారిదే. కొందరు విభజన జరగదని భరోసా ఇస్తుంటే, మరి కొందరు విభజన తధ్యమని బల్లగుద్ది మరీ వాదిస్తుంటారు. ప్యాకేజీలు పుచ్చుకోవడమే తక్షణ కర్తవ్యమని కొందరు, “శాసనసభలో ఎవరి వాదనలు వారు వినిపించడంలో తప్పు లేదు. కానీ అధిష్టానం నిర్ణయమే అందరికీ శిరోధార్యమని” బొత్స వంటి వారు లౌక్యం ప్రదర్శిస్తుంటారు.
ఇక జేసీ సోదరులయితే ఇంకా హైదరాబాద్ పట్టుకొని వ్రేలాడటం దండుగ! వెంటనే ఎక్కడో అక్కడ కొత్త రాజధాని పెట్టుకొని అక్కడి నుండి బయటపడటం మేలని ఉచిత సలహా ఇస్తుంటే, కేంద్రమంత్రి పదవి అందుకొన్న తరువాత “అధిష్టానం ఎంత చెపితే అంతే!” అని పలికిన జేడీ శీలం ఇప్పుడు “హైదరాబాద్ ని ఒక ఆరేడు సం.లకి యూటీ చేయడానికి తెలంగాణా నేతలు అంగీకరిస్తే, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరితో మాట్లాడి ఒప్పించి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి మార్గం సుగమం చేసే బాధ్యత నాదని” తాజాగా ఓ ప్రతిపాదన చేసారు.
“60 ఏళ్ళుగా మనం కలిసున్నాము. మరో ఆరేడేళ్ళు కలిసి ఉండటానికి కష్టం ఏమిటి? హైదరాబాద్ తెలంగాణాలో అంతర్భాగమని మేము ఒప్పుకొంటున్నాము. పది జిల్లాలతో కూడిన తెలంగాణా ఏర్పాటుకి మేమందరం పూర్తిగా సహకరిస్తాము. విద్య, విద్యుత్, ఉపాధి, నీటి సమస్యలను కూడా ఇద్దరికీ నష్టం కలిగించని విధంగా అన్నిటినీ పరిష్కరించుకొందాము. మీరు మాకు సహకరిస్తే మేము కూడా మీకు పూర్తిగా సహకరిస్తామని మా సీమాంధ్ర నేతలందరి తరపునా నేను హామీ ఇస్తున్నాను"
"తెలంగాణా ఏర్పాటు చేసుకోవాలనే మీ చిరకాల స్వప్నం సాకారం చేసుకోవాలంటే ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవసరం. లేకుంటే చివరి దాక కూడా ఈ ఘర్షణ వాతావరణం తప్పకపోవచ్చు,” అని శీలం తెలంగాణా నేతలకి నయాన్న, భయాన్న నచ్చజెప్పే ప్రయత్నం చేసారు.
జేడీ శీలం హైదరాబాద్ ని యూటీ చేస్తే రాష్ట్ర విభజనకు సహకరిస్తామని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరి తరపున హామీ ఇస్తున్నారు. బాగానే ఉంది. సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, “ఈ సమైక్య రాష్ట్రానికి తను ఆఖరి ముఖ్యమంత్రిని కానని, తన తరువాత ఇంకా చాలా మంది వస్తారని” నిన్ననే మరోమారు రచ్చబండ సాక్షిగా ప్రకటించారు. మరి ఆయన ఆలపిస్తున్నఈ పాటలన్నీరోటికాడ పాటలేనని శీలంగారి అభిప్రాయమా?
“కిరణ్ చాలా మంచోడు. అమ్మ మాట జవ దాటాడు. రాష్ట్ర విభజనకు తలూపేడు కూడా!” అని దిగ్విజయ్ సింగ్ అంతటి వాడు మీడియా ముందు ప్రకటిస్తే, “అది ఒట్టి అబద్దం. అది కేవలం ఆయన అపోహ మాత్రమే!” అని టకీమని జవాబిచ్చిఆయన నోరు మూయించిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మనసు మార్చుకొని,శీలం చేస్తున్నఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారని హామీ ఏమయినా ఇచ్చేరా? ఇక రాష్ట్ర విభజన అంశం కేవలం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని శీలం భావిస్తున్నారా? ఏమో!