కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఇన్నింగ్స్ డిక్లేర్? టీడీపీలో సోదరుల యాక్టివ్ రోల్
posted on Dec 31, 2020 @ 10:24AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ, సమైక్య ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆయనే ముఖ్యమంత్రి. ఏపీ విభజనను అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నించిన నేత. స్వతాహాగా క్రికెటర్ అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి... విభజన సమయంలోనూ సమైక్యాంధ్ర కోసం లాస్ట్ బాల్ వరకు పోరాడి.. చివరికి చేసేది లేక సీఎం పదవిని వదులుకున్నారు. ఏపీ విభజనకు వ్యతిరేకంగా సీఎం పోస్టుకు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి... 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి.
2017లో కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అప్పుడు ఆయన ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారనే ప్రచారం జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఉమెన్‌చాందీ కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రస్తావించారని అందుకు సోనియాగాంధీ ఆమోద ముద్రవేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డిని సోనియా గాంధీ ఢిల్లీకి పిలిపించారని, ఆయననే ఏపీసీసీ చీఫ్ గా నియమించనున్నారని భావించారు. అయితే పీసీసీ పగ్గాలు చేపట్టే ఆలోచన తనకు లేదని చెప్పుకొచ్చారు నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్ పదవి తనకేనంటూ వస్తున్న వార్తలు కేవలం మీడియా సృష్టేనన్నారు. తర్వాత కొంత కాలానికి తిరుపతిలో మీడియాతో తన మనసులోని మాటలు పంచుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ఎంతో భాదేస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సాగు, తాగునీరు ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి.
కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినా యాక్టివ్ రాజకీయాలు మాత్రం చేయడం లేదు. ఇందుకు బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో ముఖ్య నేతగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో అన్న స్థానంలో పీలేరు నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓడి పోయిన కిషోర్ కుమార్ రెడ్డి.. తర్వాత టీడీపీలో చేరారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ గానే పని చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా టీడీపీలో ఇప్పుడు కీలక నేతగా ఉన్నారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా.. కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టకపోవడానికి ఇది కూడా ఒక కారణమంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భవిష్యత్ లోనూ బలపడే సూనచలు కనిపించకపోవడం, టీడీపీలో తన కుటుంబ సభ్యులు యాక్టివ్ గా ఉండటం తదితర అంశాలతో రాజకీయాలకు దూరంగా ఉండటమే బెటరనే నిర్ణయానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారని చెబుతున్నారు. దాదాపుగా ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టేనని తెలుస్తోంది. ఆయన అభిమానులు, అనుచరులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మొత్తానికి సమైక్య ఉద్యమ చాంపియన్ గా నిలిచిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ముగియడంతో ఆయన అనుచరులు నిరాశ పడుతున్నారు.