బంగారు తల్లి పై అసంతృప్తి
posted on Jun 8, 2013 @ 10:57AM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో 27 అంశాలకు కేబినేట్‌లో ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘బంగారు తల్లి’ పథకానికి చట్ట బద్దత కల్పించే విషయంలో కేబినెట్‌లో ఏకాభిప్రాయం కుదరలేదు. బంగారు తల్లి పథకానికి చట్టబద్ధత కల్పించే విషయమై కేబినెట్ సబ్ కమిటీకి బదలాయించడం జరిగింది.
బంగారు తల్లి పథకంపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జానారెడ్డిలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా కేబినెట్‌లో చర్చించి ఉండాల్సిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ పథకం అమలులో లోపాలు ఉండకూడదని వారు సూచించారు. దీనిపై స్పందించిన సీఎం కిరణ్ ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తానని, పథకం అమలుపై సూచనలు చేయాలని చెప్పారు. అయినా బంగారు తల్లి పథకంపై ఏకాభిప్రాయం కుదరలేదు. మరోవైపు మంత్రుల ప్రశ్నలకు సీఎం స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయారని సమాచారం.
కాగా ఈ సమావేశంలో మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేసిన డిఎల్ రవీంద్రారెడ్డి అంశం ప్రస్తావనకు రాకుండా ముఖ్యమంత్రి బంగారు తల్లి పథకంపై చర్చకు అవకాశం ఇచ్చారు. దీనిపై కొందరు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.