చిరంజీవి మెగా కోరిక
posted on Jun 8, 2013 @ 10:58AM
ఇన్నాళ్ళు రామచంద్రయ్య తన భజన చేస్తుంటే కాదనలేని చిరంజీవి, డిల్లీలో అమ్మగారి ఆశీసులు అందుకున్నారో మరేమో గానీ డిల్లీలో ఒక ఇంగ్లిష్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యులో పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి పదవి చెప్పడ్డానికి సైతం తాను సిద్ధమేనని ప్రకటించి కిరణ్ కుమార్ రెడ్డి గుండెల్లో చల్లగా బాంబులు పేల్చారు. అంటే, ఆయనలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనే తపన ఇంకా సజీవంగానే ఉందని అర్ధం అవుతోంది. అధిష్టానం కూడా తనకు సానుకూలంగా ఉండటంతో, కాంగ్రెస్ నీటిని బాగా వంట బట్టించుకొన్నఆయన పార్టీ సంప్రదాయాల ప్రకారం తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని అప్పుడప్పుడు మీడియా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
నిన్నగాక మొన్న రాజకీయాలలోకి, కాంగ్రెస్ పార్టీలో దూకిన ఆయన పార్టీలో తనకంటే చాలామంది సీనియర్లు ముఖ్యమంత్రి కుర్చీ కోసం క్యూలో చాలా ఏళ్లుగా నిలుచొని ఉన్నారని తెలిసి కూడా ఇటువంటి కోరిక వెళ్ళబుచ్చడం, ఆయనలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతోంది. అటువంటి కీలక పదవులు ఆశించేవారు ముందుగా ప్రజలలో, పార్టీలో తమ ఆలోచలను వ్యాపింపజేయడం ద్వారా, కొంత సానుకూల వాతావరణం సృష్టించుకొంటుంటారు. తద్వారా అవకాశం వచ్చినప్పుడు కొత్తగా బరిలో దిగినట్లుకాక పార్టీలో తాము కూడా పాత ‘కాపు’లేనని, ఆ కుర్చీలో కూర్చోవడానికి తమకీ అర్హత, అవసరం రెండూ ఉన్నాయని గట్టిగా వాదించవచ్చును. ప్రస్తుతం చిరంజీవి కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు గనుక 2014లో కాకపోయినా మరో ఒకట్రొండు సంవత్సరాలలో అయినా కుర్చీకి సరిపోయేలా ముదురుతారని చెప్పవచ్చును.