ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో స్పెయిన్ బుల్
posted on Jun 8, 2013 @ 10:37AM
ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో మూడో సీడ్ నడాల్ 6-4, 3-6, 6-1, 6-7(3), 9-7తో టాప్ సీడ్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌పై పోరాడి గెలిచాడు. వరుసగా ఎనిమిదో సారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. మట్టి కోర్ట్ లో కొదమసింహల్లా పోరాడి టెన్నిస్ అభిమానులను కనువిందు చేశారు. 4 గంటల 37 నిముషాలు సాగిన ఈ మ్యాచ్ గ్రాండ్ స్లామ్ చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్ ల్లో ఒకటిగా నిలిచింది.
ఆదివారం జరిగే ఫైనల్లో నడాల్.. స్పెయిన్‌కే చెందిన డేవిడ్ ఫెర్రర్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. గాయం నుంచి కోలుకున్నాక తొలి టోర్నీలో ఆడుతున్న నడాల్ ఆత్మవిశ్వాసంతో పోరాటపటిమ కనబరిచాడు. తొలిసెట్లో నడాల్, రెండో సెట్లో జొకోవిచ్ హవా సాగింది. మూడో సెట్లో స్పెయిన్ బుల్ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించి సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత అసలైన పోరు మొదలైంది. నాలుగో సెట్లో పుంజుకున్న నొవాక్ టైబ్రేకర్‌లో నెగ్గి విజయావకాశాల్ని సజీవంగా ఉంచుకున్నాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్లో 82 నిమిషాల పాటు హోరీహోరీగా పోరాడారు. చివరకు నడాల్ ఉత్కంఠ విజయం సాధించాడు. జొకోవిచ్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.