ఆర్టీసి సమ్మెను విరమించటానికి ప్రభుత్వం ఓ మెట్టు దిగనుందా..?

 

పట్టు వీడని జేఏసీ మెట్టు దిగని సర్కార్ తెలంగాణా ఆర్టీసీ సమ్మె కేంద్రంగా కనిపిస్తుంది. కానీ, ఒకవేళ ఆర్టీసీ కార్మికులు కాస్త మెత్తబడి చర్చలకొస్తే సర్కార్ సానుభూతి చూపించే అవకాశం ఉందా, ఉద్యోగాలు లేవని ప్రకటించిన సీఎం కేసీఆర్ కరుణిస్తారా, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో మహదావకాశం ఉన్నట్టే కనిపిస్తోంది. టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దాంట్లో ఆయన రాసిన అంశం కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని, సూసైడ్ ఏ సమస్యకూ పరిష్కారం కాదు అని తెలిపారు.

నలభై నాలుగు శాతం ఫిట్ మెంట్ పదహారు శాతం ఐఆర్ ఇచ్చి ఆర్టీసీ గొప్పగా ఆదుకున్న ఘనత టి.ఆర్.ఎస్ ప్రభుత్వానిదే అని ఆయన లేఖ ద్వారా ఆయన గుర్తు చేశారు. రెండు వేల పధ్ధెనిమిది ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో తాను ఉన్నా అని, ఎక్కడా కూడా అర్టీసి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదు అని అలా చేయడమంటే పాలసీని మార్చుకోవడమే అన్నారు. ఇదంతా సాదాసీదా కామెంట్స్ అయినా కానీ పరిస్థితి చేజారిపోకముందే కార్మికులు సమ్మె విరమించాలి అని కూడా రాశారు. కార్మికులు ముందుకొస్తే పరిస్థితి అదుపు లోకి వచ్చినట్టే అని తెలుస్తుంది. అద్దె బస్సులు ప్రైవేట్ స్టేజ్ క్యారియర్ పై సీఎం తీసుకున్న నిర్ణయం సమ్మె నేపథ్యంలోనే అని గుర్తించాలని చెప్పారు కేకే.

అయితే అర్టీసి కార్మికుల సమ్మె తీవ్ర తరం అవడంతో ప్రభుత్వం దీనిని ఆపాలనే ఉద్దేశంతో కెకెతో అధికారికంగా కాకపోయినా ఆర్టీసి సంఘాలతో సంప్రదింపులు జరిపి సమ్మెను విరమించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు టీఎన్జీవోలు కూడా తాము ఆర్టీసి తరపున ప్రభుత్వంతో చర్చలు జరపటానికి సిధ్ధంగా ఉన్నామని ముందుకొచ్చారు. వారు ముందే సీఎం కె.సి.ఆర్ ను సంప్రదించామని అన్నారు. దీంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగటానికి సిధ్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.