కమలం తీర్థం కోసం గులాబి నేతల క్యూ
posted on Nov 17, 2022 @ 11:59PM
ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇకపై ఒక లెక్కా అంటున్నాయి కమలం శ్రేణులు. బీజేపీపై విమర్శలు గుప్పించే జోరులో తెలంగాణ సీఎం, తెరాస అధినేత కేసీఆర్ చేసిన ఒక ప్రకటన తమకు కొత్త బలాన్ని తీసుకువస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇంతకీ కేసీఆర్ చేసిన ప్రకటన ఏమిటి? అది బీజేపీకి ఎందుకు బలం అవుతుంది? కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ సిట్టింగులెవరూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, సిట్టింగులందరికీ టికెట్లు గ్యారంటీ అని ప్రకటించారు.
ఇప్పుడు ఆ ప్రకటనే తమ నెత్తిన పాలు పోసిందంటున్నాయి కమల నాథుల. ఔను నిజంగానే సిట్టింగులకే మళ్లీ సీట్లిస్తామన్న తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విస్పష్టమైన హామీ బీజేపీకి వరంలా పరిణమించనుంది. సిట్టింగులపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే స్థాయి నేతలు ‘కారు’ దిగి కమలం గూటికి వరస కడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కారెక్కించుకోవడం వల్ల టీఆర్ఎస్ పూర్తిగా నిండిపోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో వర్గ పోరు నడుస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత సిట్టింగులందరికీ టికెట్లు అని ప్రకటించడంతో ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుత సిట్టింగ్ చేతిలో పరాజయం పాలైన వారందిరలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది.
కచ్చితంగా వారందరి చూపు బీజేపీ వైపే మళ్లుతుందని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ వచ్చే ఎన్నికలలో విజయం మాదేనని ఎంత ధీమాగా చెబుతున్నా.. రాష్ట్రంలోని 119 స్థానాలలోనే నిలబెట్టేందుకు ఆ పార్టీకి గెలుపు ధీమ ఉన్న అభ్యర్థుల కొరత ఉందన్నది కాదనలేని వాస్తవం. అర్బన్ ప్రాంతాలలో ఒకింత ఫరవాలేదనుకున్న గ్రామీణ ప్రాంతాలలో మాత్రం బీజేపీని అభ్యర్థుల కొరత వేధిస్తోందన్నది సత్యం. ఇప్పుడు కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లు అన్న ప్రకటన బీజేపీ నుంచి పెద్ద ఎత్తున బీజేపీలోకి వలసలు ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అలా వచ్చే వారికి కమల పుష్పాలతో స్వాగతం పలకడానికి చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ లో పలువురు నేతలతో ఇప్పటికీ ఈటలకు సత్సంబంధాలున్నాయి. అక్కడ అసంతృప్తితో ఉన్న నాయకులంతా ఇప్పటికే ఈటల టచ్ లోకి వచ్చారనీ అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ పార్టీ మారకుండా టీఆర్ఎస్ నే వారు అంటిపెట్టుకుని ఉండటం పార్టీ టికెట్ వస్తుందన్న ఆశేనంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ స్వయంగా సిట్టింగులకు టికెట్ గ్యారంటీ అని చెప్పడంతో ఆశావహులలో అత్యధికులు ఇక కారులో ప్రయాణం అనవసరం అన్న నిర్ణయానికి వచ్చేశారంటున్నారు. అందుకే కేసీఆర్ సిట్టింగులకే టికెట్టన్న ప్రకటన బీజేపీకి నెత్తిన పాలు పోసినట్లుగా అయ్యిందంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్న ఆశావహులకు టీఆర్ఎస్ ప్రకటన తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇప్పటికే టీడీపీ- కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల వల్ల, తమ అవకాశాలు దెబ్బతిన్నాయని అసంతృప్తితో రగిలిపోతున్నవారంతా.. ఇక తమ దారి తాము చూసుకోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. ఈ పరిస్థితినే బీజేపీ రాజకీయంగా సద్వినియోగం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతోంది. సిట్టింగులకే సీటు అంటూ కేసీఆర్ ఇలా ప్రకటించారో లేదో.. అలా రాష్ట్ర సీనియర్ నాయకులకు హస్తిన నుంచి పిలుపు వచ్చింది. టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలను గుర్తించాల్సిందిగా పార్టీ హైకమాండ్ రాష్ట్ర నాయకులను ఆదేశించిందంటున్నారు. సిట్టింగులను మారిస్తే తప్ప గెలుపు అవకాశాలు లేవంటూ పీకే చెప్పిన దాదాపు 67 నియేజకవర్గాలలోని క్రియాశల నాయకులు, మాజీ ఎమ్మెల్యేలను గుర్తించి వారిని కమలం పార్టీలోకి ఆహ్వానించాలని కూడా హై కమాండ్ ఆదేశించినట్లు చెబుతున్నారు.
అలాగే పార్టీలోకి ఎవరిని చేర్చుకోవాలి అన్న విషయంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈటలకు చెప్పినట్లు తెలుస్తోంది.టికెట్లపై ఆశలు పెట్టుకుని, కేసీఆర్ ప్రకటనతో నిరాశకు గురయిన టీఆర్‌ఎస్ అసంతృప్త నేతలతో మాట్లాడే బాధ్యతను మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి బీజేపీ హై కమాండ్ అప్పగించినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో చేరే వారికి ఎమ్మెల్యే సీట్ల హామీ ఇవ్వడం ద్వారా, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని తిరుగులేనిశక్తిగా మార్చాలన్నదే బీజేపీ వ్యూహంగా పరిశీలకులు తాజా పరిణామాలను విశ్లేషిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోని అన్ని నియోజకవర్గ నాయకులతో సత్సంబంధాలున్న ఈటల ద్వారా, వారిని బీజేపీలోకి తీసుకురావాలన్నలక్ష్యంతో బీజేపీ అడుగులు కదుపుతోందంటున్నారు.