ఇక గులాబి బాస్ ఎన్నికల ప్రచార భేరి.. వరుస సభలతో సుడిగాలి పర్యటనలు
posted on Oct 11, 2023 @ 10:50AM
తెలంగాణలో ఎన్నికల సమరం జోరందుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన క్షణం నుంచే రాష్ట్రంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలూ ఎన్నికల రణరంగంలోకి దూకేశాయి. అందరి కంటే ముందుగా ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లుగా కనిపించిన అధికార బీఆర్ఎస్ మాత్రం ఆ తరువాత వెనుకబడినట్లుగా కనిపించింది. ఇందుకు కారణాలెన్నున్నా.. వాటిలో ముఖ్యమైనది మాత్రం కేసీఆర్ అనారోగ్యమనే చెప్పాలి.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను ఒకే దఫాలో 115 మంది అభ్యర్థులను ప్రకటించేసి.. దూకుడు మీద కనిపించిన కేసీఆర్.. పార్టీలో వెల్లువెత్తిన అసమ్మతి, అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు ఆరంభించారు. టికెట్లు ఆశించి దక్కక అసంతృప్తికి లోనైన వారిని పదవుల పందేరంతో బుజ్జగించే ప్రయత్నాలు ఆరంభించారు. కొందరికి పదవులు కట్టబెట్టారు కూడా. అయితే ఆ తరువాత ఆయన అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహకాల విషయంలో, పార్టీలో లుకలుకలను పరిష్కరించుకునే విషయంలో బాగా వెనుక బడింది. అదే సమయంలో పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఓ కొలిక్కిరాకపోయినా.. ప్రచారం, ప్రచార సన్నాహకాల విషయంలో మాత్రం కాంగ్రెస్ రేసు గుర్రంలా దూసుకుపోతున్నది. ఆ పార్టీ సంస్కృతిలో భాగంగా అందరూ చెప్పే అసమ్మతి, గ్రూపు విభేదాలను ఈ పార్టీ చాకచక్యంతో పరిష్కరించుకుంది.
ఇక బీజేపీ కూడా అగ్రనేతల వరుస పర్యటనలతో దూకుడు ప్రదర్శిస్తున్నది. అదే సమయంలో అధికార బీఆర్ఎస్ మాత్రం అధినత అనారోగ్యం కారణంగా డీలా పడింది. ఈ నేపథ్యంలోనే దాదాపు మూడు వారాల పాటు ఇంటికే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కదన రంగంలోకి దూకేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 15నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారు చేసేశారు. ఈ నెల 15న ప్రగతి భవన్ లో అభ్యర్థులకు బీ ఫాంల పంపిణీతో మొదలెట్టి పార్టీ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ఆయన సెంటిమెంట్ ప్రకారం వచ్చే నెల 9న తన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ సారి ఆయన గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా ఎన్నికల బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. అదే రోజుల అంటే నవంబర్ 9న ఆయన రెండు నియోజకవర్గాలలోనూ నామినేషన్లు దాఖలు చేస్తారు.
ఇక ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన తన సెంటిమెంట్ ను కొనసాగిస్తూ హుస్నాబాద్ నుంచే ప్రారంభించనున్నారు. ఈ నెల 15 హుస్నాబాద్ తో మొదలు పెట్టి వరుసగా నాలుగు రోజుల పాటు ఏడు నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేసి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఆ తరువాత వారం రోజులు అంటే ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకూ విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత అంటే ఈ నెల 26 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు వరుసగా నియోజకవర్గాలలో నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఈ మేరకు ఇప్పటికే కేసీఆర్ పర్యటనలు, సభలకు సంబంధించి రోడ్ మ్యాప్, షెడ్యూల్ ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.