ఏపీలో చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్.. తెలంగాణలో కాంగ్రెస్ పెరుగుతున్న మద్దతు!
posted on Oct 11, 2023 @ 10:03AM
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఏపీలో రాజకీయాలు చల్లబడ్డాయి. టీడీపీ నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిస్తుంటే.. అధికార వైసీపీ చేసిన తప్పును ఒప్పుగా చూపించాలని తెగ ఆరాటపడుతుంది. ఇటు రాష్ట్రంలో పాలన.. అటు రాజకీయాలు రెండూ స్థబ్ధుగా మారిపోయాయి. అయితే, అదే చంద్రబాబు అరెస్ట్ తెలంగాణలో మాత్రం రాజకీయాలను వేగంగా మార్చేస్తుంది. నిజానికి తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ అంచనాలు ఎప్పటికప్పుడు తారుమారు అవుతూ వస్తున్నాయి. గెలుపోటములను అంచనా వేస్తూ ఇప్పటికే చాలా సర్వేలు బయటకు వచ్చినా మారుతున్న సమీకరణలతో ఆ అంచనాలు తప్పడం ఖాయమనే భావన రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. రోజురోజుకీ తెలంగాణలో బీజేపీలో పరిస్థితులు గాడి తప్పడం.. కాంగ్రెస్ బలీయంగా మారుతుండడం.. కేసీఆర్ అనారోగ్యంతో కనిపించకపోవడం తదితర కారణాలతో నెల రోజుల క్రితం ఉన్న పరిస్థితిలు ఇప్పుడు కనిపించడం లేదు.
వీటికి తోడు చంద్రబాబు అరెస్టు, అరెస్టుపై బీఆర్ఎస్ అగ్ర నేతలు స్పందించకపోవడం.. స్పందించిన కేటీఆర్.. ఆంధ్రా గొడవలతో మాకేం సంబంధం.. మాకు జగన్, పవన్, లోకేష్ అందరూ ఒక్కటే.. అందరూ మిత్రులే అంటూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ఇప్పుడు మరింత నష్టాన్ని తెచ్చేలా కనిపిస్తుంది. ఈ విషయంలో ఇప్పటికే తప్పిదాన్ని గ్రహించిన బీఆర్ఎస్ దాన్ని మాఫి చేసుకొనేందుకు రకరకాల మార్గాలలో సీమాంధ్ర సెటిలర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది. కానీ, చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ వైఖరి మాత్రం సీమాంధ్ర సెటిలర్లలో అసంతృత్తి చల్లారడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డిలో ఉండే కమ్మ సామాజికవర్గానికి చెందిన సీమాంధ్ర సెటిలర్లు ఈ విషయంలో బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే ఆగ్రహంతోనే తెలంగాణ కమ్మ ఐక్య వేదిక తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాలలో కమ్మ సామాజికవర్గం టీడీపీకి పెట్టని కోట అనే సంగతి తెలిసిందే. ఈ సామాజికవర్గంలో దాదాపు 80 శాతం పైగా ప్రజలు టీడీపీకి మద్దతుగా ఉంటారు. తెలంగాణలో కూడా గత ఎన్నికల ముందు వరకూ వీరంతా టీడీపీతోనే ఉండేవారు. కానీ, మారిన రాజకీయ పరిస్థితులలో టీడీపీపై కోపం లేకపోయినా వీరంతా ఇతర పార్టీలకు షిఫ్ట్ అయ్యారు. అప్పటికే ఏపీకి అన్యాయం చేసిన పార్టీలుగా కులమతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లను కాదని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను, ద్వితీయ స్థాయి నేతలను బీఆర్ఎస్ గాలమేసి లాగేసుకోవడంతో హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలలో ఉండే కమ్మ సామాజికవర్గ సెటిలర్లు కూడా బీఆర్ఎస్ వైపు వెళ్లారు. కానీ, ఇప్పుడు వారంతా బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్ లో బీఆర్ఎస్ వైఖరిపై అసంతృప్తిలో ఉన్న కమ్మ ఐక్య వేదిక కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది.
చంద్రబాబు ఎపిసోడ్ లో బీఆర్ఎస్ వైఖరి వలనే తాము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు కమ్మ ఐక్య వేదిక ప్రతినిధులు బహిరంగంగానే ప్రకటించారు. తెలంగాణలో పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఉండడమే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పేరుకు కాంగ్రెస్ లో ఉన్నా చంద్రబాబుకు సన్నిహితుడుగానే ఉంటున్నారన్న భావన ఉంది. పార్టీ మారినా నేటికీ చంద్రబాబును పల్లెత్తు మాట అనని రేవంత్ నేటికీ చంద్రబాబు, టీడీపీపై అదే గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకే మల్కాజిగిరిలో రేవంత్ గెలవగలిగారు. తెలంగాణలో ఏ టీడీపీ కార్యకర్తకు కూడా రేవంత్ రెడ్డిపై వ్యతిరేక భావన ఉండదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలే ముందుగా స్పందించారు.. ఖండించారు. తెలంగాణలో చంద్రబాబు అరెస్టుపై నిరసనలలో కూడా కాంగ్రెస్ నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కమ్మ ఐక్య వేదిక కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చంద్రబాబు అరెస్ట్ ప్రభావంతో నష్టం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.