మళ్ళీ ఢిల్లీకి కేసీఆర్ ఈసారి అజెండా అదేనా?
posted on Jul 25, 2022 @ 2:07PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పయనమవుతున్నారు.ఇంచుమించుగా రెండు నెలల విరామం తర్వాత, అయన మరో మారు ఢిల్లీ వెళుతున్నారు. సోమవారం (జులై 25) సాయంత్రం ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు మరో కొందరు మంత్రులు, ముఖ్యనాయకులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెసుస్తోంది.
అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు, అంటే, భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళుతున్నారని అధికార వర్గాల సమాచారం. అయితే, కేవలం నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు చెప్పేందుకేనా? అంటే, కావచ్చును, కాకపోవచ్చును అనే సమాధానమే వస్తోంది. ఎందుకంటే, ముఖ్యమంత్రి జాతీయ పార్టీ ఏర్పాటు విషయంగానూ, అటూ ఇటూ అడుగులు వేస్తున్నారు. మరోవంక, మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యూహాన్ని మార్చుకున్నారని అంటున్నారు.
అయితే, ముఖ్యమంత్రి ఇలా వెళ్లి అలా రావడం లేదు, రెండు మూడు రోజులు అక్కడే ఉంటారని అంటున్నారు. జాతీయ రాజకీయాలపై కొందరు కీలక నేతలను కలిసే చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అంటే కేవలం నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు చెప్పడం ఒక్కటే కార్యం కాదు. అదొక్కటే ముఖ్యమంత్రి హస్తిన యాత్ర పరమార్ధం కాదు, చక్క పెట్టవలసిన కార్యాలు ఇంకా ఉన్నాయని అంటున్నారు.
జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ సహ ఇతర ప్రతిపక్ష పార్టీలతో, కలిసి నడిచేందుకు ఒక విధంగా మానసికంగా సిద్దమైన ముఖ్యమంత్రి, ఈ పర్యటనలో ఆ దిశగా ఒకడుగు ముందుకేసే అవకాశం లేక పోలేదని అంటున్నారు. అందులో భాగంగా.. విపక్ష పార్టీల నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి, యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. అలాగే, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని విచారించడాన్నీ వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లోపల వెలుపల నిర్వహించిన నిరసన ప్రదర్శనలకు తెరాస ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా మద్దతు నిచ్చింది.
ఇక ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరేట్ అల్వాను ప్రతిపక్ష పార్టీలు ఉపరాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్ధిగా ప్రకటించాయి. అయితే తెరాస మాత్రం ఇంకా స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేదు. కానీ,ఒక విధంగా కాంగ్రెస్ కు దూరం అంటూనే దగ్గరయ్యే ప్రయత్నాలు తెరాస సాగిస్తోంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ఈ విషయంలో మరో ముందడుగు వేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి ఇదమిద్దంగా ఎందుకు వెళుతున్నారు ... అనే విషయంలో మాత్రం ఎవరికీ స్పష్టత లేదని, అవకాశం చిక్కితే, ఒకరిద్దరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని అంటున్నారు.