అలిగి పోతానంటున్న తమ్ముడు..
posted on Jul 25, 2022 @ 2:20PM
పిల్లాడు బొత్తిగా మాట వినడం లేదని టీచర్ నుంచి పిల్లాడి తల్లికి అందిన వార్త. పిల్లాడి రిపోర్టు తెప్పించు కున్న తండ్రి. పోనీలేద్దరూ చిన్నవెధవా.. అంటూ బామ్మగారు మధ్యవర్తిత్వం.. ఇవేమీ పట్టనట్టు పిల్లాడి ఆటలు, మాటలు. వీడసలు ఎవరితో తిరుగుతున్నాడో తెలుసుకో.. వాడి బాబాయి ప్రశ్న. ఎనిమిదో తరగతి పిల్లాడి గురించి ఇంతమంది వాకబు చేస్తుంటారు. వాడి మీద ఎంతో మంది నిఘా. మరి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి మీద ఎందరి డిటెక్టివ్ కళ్లు ఉన్నాయో మరి!
రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ అధ్యక్షస్థానానికి తన సోదరుడిని ప్రతిపాదించి మద్దతునిచ్చిన రాజగోపాల్ రెడ్డిని క్రమేపీ పార్టీ వ్యవహారశైలి ఇబ్బంది పెట్టింది. ఇన్నాళ్లు నమ్ముకున్న పార్టీ తనను అవమానిస్తున్నందుకు నిరసనగా పార్టీ తీరు తెన్నుల మీద విమర్శనాస్త్రాలూ సంధించారు. చిలికిచిలికి గాలివానగా మారి పార్టీతో సంబంధాలు దెబ్బతినే స్థాయికి వచ్చాయి. ఇక లాభం లేదని బీజేపీ వారితో చేతులు కలపడానికి నిశ్చయించుకున్నారు. బీజేపీ సీనియర్లను కలిసేరు. కానీ వారు తప్పకుండా గెలిచే అవకాశాలున్నాయన్న హామీనిస్తే ఎలాంటి సాయమన్నాచేస్తామని హామీనిచ్చారు. ఇది రహస్య సమావేశం కాదు నిజంగానే కలిసి మాట్లాడని రాజగోపాల్ స్వయంగా ప్రకటించారు. దీంతో పార్టీని త్వరలో వదిలేస్తారన్నది విపక్షాలకూ అర్ధమైంది.
అసలు పార్టీని ఆయన వదలేంత పరిస్థితులు ఎందుకు తెచ్చుకున్నారని తెలంగాణా కాంగ్రెస్ వ్యవహా రాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పార్టీ వర్గాల నుంచి సమాచారం కోరారు. అలక వచ్చేట్టు చేసినం దుకు అత్తగారిని అనకుండా ఎందుకు కోపగించుకుని తిండి మానేశావే అని సోదర సమాన చిన్న కోడల్ని పెద్ద కోడలు అడిగినట్టు ఆయన అందరి నుంచీ ఆరా తీస్తున్నారు. ఢిల్లీలో అధిష్టానం కూడా అట్టి సమా చారం స్పష్టం చేయమని కోరింది. అలిగినవాడు వెనక్కి తిరిగి వస్తాడని ఆశించడం కష్టమే. కనుక కాంగ్రెస్ సీనియర్లు ఇపుడు తమ్ముడు ఎందుకు అలిగాడో సరిగ్గా కనుక్కుని బుజ్జగించాలని కోమటిరెడ్డి వెంకట రెడ్డిని కోరుతున్నారు. కానీ అన్నదమ్ములు ఇంట్లోంచి బయటకి వచ్చాక కాంగ్రెస్, రెబెల్ అనే స్థితికి ఇద్దరూ తయారయ్యారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఉత్తమ్‌కుమార్ కూడా అన్నా.. నీ తమ్ముడిని శాంతింపచేయమని అడుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి వెళ్లిపోతే కాంగ్రెస్ పార్టీకి ఇక నలుగురే ఎమ్మెల్యేలు ఉంటారని.. దీనిపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా స్పందిం చాలని వీహెచ్ కోరారు.
రాజగోపాల్ మాత్రం అవమాన భారంతో ఆగ్రహిస్తున్నారేగాని పార్టీ అధిష్టానం వచ్చి చెప్పినా వినే స్థితిలో లేరు. పైగా బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది గనుక మరీ పట్టుదలతో ఉన్నారు. తాను పార్టీని వీడడానికే కంకణం కట్టుకున్నా నని పార్టీలో ఉండి విసిగెత్తే కంటే దూరంగా, ప్రశాంతంగా వేరే పార్టీ నీడలో అడుగు ముందుకేయడం శ్రేయస్కరమన్న ధోరణి బయటపెట్టారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం అయ్యేందుకు ముందు ఆయన పార్టీ మారతారంటూ చాలా కథనాలు వచ్చాయి. అయితే సీనియర్లు నచ్చచెప్పడంతో ఆయన ఆలోచనను విరమించుకున్నా రు. కొన్నాళ్లుగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కూడా అనేకసార్లు విమర్శలు చేశారు. గతంలో నల్గొండ జిల్లాలో రేవంత్‌రెడ్డి సభ పెట్టకుండా ప్రయత్నించడం వంటి పరిణామాలు కాంగ్రెస్‌ను వీడడం తథ్యం అనే సంకేతాలు కూడా ఇచ్చాయి.
ఇహ ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగారు. ప్రెస్‌మీట్‌లో కోమటిరెడ్డి మాట్లాడిన అంశాలను అధిష్టానం క్లిప్పింగ్స్ తీసుకుంది. రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా పార్టీ విషయంలో చేసిన కామెంట్స్, ఇచ్చిన వివరణలను ఠాగూర్ తెప్పించుకున్నారు. గతంలో ఆర్సీ కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పార్టీ విషయంలో అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా చేసిన కామెంట్స్‌ను కూడా ఠాగూర్ పరిశీలిస్తున్నారు. తాజాగా సోనియా గాంధీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. పార్టీ మారడం చారిత్రాత్మక అవసరం అంటూ కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఎవరు ఎంత ప్రయత్నించినా జరగవలసిన అనివార్యం జరగకాపోదు. కాంగ్రెస్‌కు ఇవేమీ కొత్త కాదు. అనేకానేక మంది పార్టీని విడిచిపోయారు. కాకుంటే కొత్త రాష్ట్రంలో పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా యన్న కాస్తంత ఆశలు కల్పిస్తున్న నాయకుల మధ్యే విభేదాలు తలెత్తడం, రాజగోపాల్ రెడ్డి పార్టీ వదిలేయాలన్న నిర్ణయాన్ని చూచాయిగా వ్యక్తంచేయడం అధిష్టానానికి మింగుడుపడటం లేదు. అందుకే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను, ఇన్ ఛార్జ్‌నీ పరుగులు పెట్టిస్తున్నారు. తమ్ముడు సామాన్యుడు కాదు బ్రో!