ఎన్నికల ఫలితాలతో తేలిపోయిన కెసిఆర్ 'వేర్పాటు'వాదం

- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

 

 

ఆంధ్రప్రదేశ్ సమైక్యతా అనుల్లంఘనీయమని నిజాం, బ్రిటిష్ పరాయి పాలనలవల్ల పలు ప్రాంతాలలో చెల్లాచెదురై శతాబ్దాలపాటు కష్టనష్టాలకు వోర్చి, తుదకు తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం ఫలితంగా ఒకే భాషా సంస్కృతుల ప్రాతిపదికపైన ఏకమైన తెలుగు (ఆంధ్ర)జాతిని తిరిగి కృత్రిమ పద్ధతుల ద్వారా విభజించడం అసాధ్యమనీ ఇటీవల రాష్ట్రవ్యాపితంగా జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి! ఈ ఫలితాలు మూడుప్రాంతాలలోని తెలుగుప్రజల వకాలిక ప్రయోజనాల రక్షణ తెలుగుజాతి సమైక్యత వల్లనే సాధ్యంకాని చీలికవల్ల కాదని మరోసారి నిరూపించాయి. గత కొన్నేళ్ళుగానూ, అంతకుముందూ కొందరు రాజకీయ నిరుద్యోగులు తెలుగువారి తెలంగాణా ప్రాంతంలో కృత్రిమంగా నిర్మించడానికి చేస్తూ వచ్చిన ప్రయత్నాలను ఎంతమాత్రం సమర్ధించుకోడానికి వీలులేకుండా సహకార సంఘాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. పంచాయితీల మాదిరే ఈ సహకార సంఘాల ఎన్నికలు కూడా కిందిస్థాయిలో జరిగే ఎన్నికలు కావడంవల్ల వాటి ఫలితాలు ప్రాథమికస్థాయిలో ప్రజాబాహుళ్యం స్థిరాభిప్రాయానికి దిక్సూచిగా భావించాలి.


చివరికి కృత్రిమ "వేర్పాటు ఉద్యమ'' నిర్మాణం కోసం మోసులెత్తిన కె.సి.ఆర్. అనే ఉత్తరాంధ్రపు వలసదారైన 'బొబ్బిలిదొర' తెలంగాణా ప్రజలమధ్య టి.ఆర్.ఎస్. పార్టీ పేరిట కుంపటి పెట్టి ఇతర ప్రాంతాలలోని తోటి తెలుగుప్రజల మధ్య పచ్చి అబద్ధ ప్రచారాలద్వారా. అక్కరకురాని కృత్రిమ హామీలద్వారా తెలంగాణా ప్రాంతంలోని మన తెలుగుయువతను భ్రమలోకి నెట్టి, ఆ భ్రమలు ఆధారంగా వారిని ఆత్మహత్యలకు పురిగొల్పడానికి ప్రత్యక్ష సూత్రధారి అయ్యాడు. ఆ పార్టీ పేరిట ఇంతవరకూ పరిమిత సంఖ్యలో గెలిచిన అసెంబ్లీ లేదా పార్లమెంటు సీట్లు కేవలం ఉపఎన్నికల ద్వారానే గాని ప్రత్యక్ష జనరల్ ఎన్నికల ద్వారా కాదు. తీరా తాజాగా తెలంగాణా సహా యావత్తు రాష్ట్రంలోనూ జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలలో గెలిచిందెవరు? ఏ "బొబ్బిలి వలసదారు'' కాంగ్రెస్ పార్టీయే తెలంగాణాలోని ఆత్మహత్యలకు, రాష్ట్రవిభజనకు, తెలంగాణా ప్రజలకూ వ్యతిరేకమనీ, మోసకారి అనీ ఇంతకాలంగా ఆడిపోసుకుంటూ వచ్చాడో ఆ కె.సి.ఆర్. పార్టీ [ఒక్క కరీంనగర్ మినహా, అక్కడ కూడా టి.ఆర్.ఎస్.తో సమంగా కాంగ్రెస్ కూ స్థానాలు దక్కాయి] ఘోరపరాజయాలు చవిచూడవలసి వచ్చింది.


అంతేగాదు, చివరికి రాష్ట్ర విభజన సమస్యపై అటూ ఇటూ కాకుండా ఉన్న, పాతికేళ్ళ రాజకీయ, పాలనానుభవంగల "తెలుగుదేశం'' పార్టీ సహితం కాంగ్రెస్ తర్వాత రెండవ పెద్ద పార్టీగా ఈ ఎన్నికల్లో తన పునాదుల్ని గణనీయంగా నిలుపుకుని విజయాలు పొందింది; అప్పటికీ "బొబ్బిలి వలస దారై''న కె.సి.ఆర్. తెలంగాణా పేరుమీద రాజకీయ నిరుద్యోగిగా పెట్టిన టి.ఆర్.ఎస్. పార్టీ ఈ ఎన్నికల్లో కనీసం మూడవస్థానాన్ని కూడా దక్కించుకొనలేకపోవడం అతని రాజకీయ శూన్యతనే కాదు, రాజకీయ నిరుద్యోగిగా అతని పదవీ వ్యామోహాన్ని కూడా ఈ ఎన్నికలు బహిర్గతం చేయడం విశేషం! కాగా, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాజకీయరంగంలో తన మరణం ద్వారా నిలిపిన శూన్యతనుంచి దూసుకువచ్చి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా "వై.యస్.ఆర్. కాంగ్రెస్'' పేరిట జగన్మోహనరెడ్డి నెలకొల్పిన పార్టీ మూడవస్థానంలో ఈ స్థానిక ఎన్నికల్లో నిలబడడం పెద్ద  విశేషం! రాష్ట్రవ్యాపితంగా మూడు ప్రాంతాలలోనూ 1219 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు జరిగిన ఎన్నికలలో 940కి పైగా సహకార సంఘాలను కాంగ్రెస్ చేపట్టబోవటం ఇంత కృత్రిమమైన వ్యతిరేక రాజకీయ గాలిదుమారం మధ్య ఆ పార్టీ ఘనవిజయంగానే భావించక తప్పదు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో, పాలనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సారథ్యంలో సరికొత్త వాతావరణానికి దారితీసి, కాంగ్రెస్ పార్టే పునరుజ్జీవనానికి తొలిమెట్టుగానూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను సంఘటితం చేయడానికి దోహదపడగల అవకాశంగానూ భావించుకోవచ్చు. ఈ తాజా ప్రాథమికస్థాయి ఎన్నికల ఫలితాలను చూచిన తరువాత కాంగ్రెస్ అధిష్ఠానం కూడా రాష్ట్ర విభజనకు, తెలుగుజాతిని చీల్చడానికీ సాహసించగల అవకాశాలు కూడా క్రమంగా తొలగిపోక తప్పదు.


ఈ ప్రాథమికస్థాయి ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చేవరకూ "బొబ్బిలి వలస దొర'' కెసిఆర్ ఒకవైపున కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్. ను విలీనం చేయడంద్వారా 2014 నాటి సార్వత్రిక ఎన్నికల తర్వాత తాను ముఖ్యమంత్రి కావాలన్న "దింపుడుకల్లాం'' ఆశతో ఉన్నాడు; కాంగ్రెస్ లో తన పార్టీని అతడు విలీనం చేయడానికి ఎప్పుడు మాట ఇచ్చి వచ్చాడో అప్పటినుంచీ తన సొంత పార్టీలోనూ, బయటా "కెసిఆర్ తెలంగాణా విద్రోహి'' అన్న తీవ్ర ఆరోపణాముద్రను మోయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా ఇప్పటిదాకా అతడు యువత "ఆత్మహత్యల''కు బాధ్యతను కాంగ్రెస్ పైకి, లేదా తనతో కృత్రిమంగా బతుకుతెరువు రాజకీయం కోసం తన పార్టీకి "మద్దతు''గా గొంతును అద్దెకు యిచ్చిన తెలంగాణా కాంగ్రెస్ రాజకీయ నిరుద్యోగులపైకి నెట్టజూస్తూ వచ్చాడు.


భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు జాతీయ కాంగ్రెస్ అగ్రేసర స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి ఆచరణ తొలిరూపం ఆంధ్రరాష్ట్రం కాగా, మలిరూపం విశాలాంధ్ర ఏర్పాటు - అదే "ఆంధ్రప్రదేశ్'' రాష్ట్రవతరణం. అందువల్ల తాడూ-బొంగరం లేని కెసిఆర్ లాంటి అవకాశవాద రాజకీయ నిరుద్యోగులకూ, ఎన్ని తప్పోప్పులున్నా ఒక స్థిరమైన జాతీయస్థాయి పార్టీగా 150ఏళ్ళ చరిత్రగల, ఢక్కామొక్కీలు తిన్న రాజకీయ సంస్థగా కాంగ్రెస్ పార్టీకీ, అది ఆచితూచి చేయవలసిన నిర్ణయాలలో భూమికీ, ఆకాశానికీ ఉన్నంత తేడా ఉంది, ఉంటుంది. అందువల్ల తెలంగాణలో యువత ఆత్మహత్యలకు ప్రత్యక్ష బాధ్యత టి.ఆర్.ఎస్.దీ, దాని నాయకుడిది కాగా, దివంగత ప్రధాని ఇందిరాగాంధీలాగా దేశ సమగ్రతా రక్షణ కోసం, రాష్ట్రాల సమైక్యతా పటిష్టత కోసం వేర్పాటు ఉద్యమాలను ఆదరించి, ప్రోత్సహించే ప్రశ్నలేదని 1969-1972 నాటి ఆంధ్ర-తెలంగాణా ప్రత్యేక ఉద్యమాల తతంగాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ లోని ఇరుపక్షాలనూ చీవాట్లు పెట్టగల స్థిరచిత్తంతో నేటి కాంగ్రెస్ అధిష్ఠానవర్గం వ్యవహరించక పోవడం వల్ల కెసిఆర్ ప్రోత్సహించిన ఆత్మహత్యలకు కాంగ్రెస్ పరోక్షంగా కారకురాలు కావలసివచ్చిందని విజ్ఞుల భావన! అందుకనే తాజా పరిణామాలలో భాగంగానే, ప్రాథమికస్థాయి సహకార సంఘాల ఎన్నికల ఫలితాల అనంతరం - వేర్పాటువాదుల రాష్ట్ర కృత్రిమ విభజన డిమాండ్ కు విలువ ఉండదని భావించవచ్చు! కాగా, సహకార సంఘాల ఎన్నికలను "మేము సీరియస్ గా తీసుకోబోమ''ని కెసిఆర్ మల్టీ నేషనల్ కుటుంబసభ్యుడు, కుమారరత్నం తారక రామారావు దిగాలుగా వ్యాఖ్యానించబోవడం ఆత్మవంచనా శిల్పంలో పరాకాష్ట!